తమిళనాడులో తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమెపై చెన్నై ఎగ్మోర్‌లోని తెలుగు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కస్తూరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో విచారించేందుకు సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను తెలుగువారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.