స్వతంత్ర వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వెళ్తున్న కారు లారీ వెనక భాగాన్ని ఢీకొంది. అదే సమయంలో వెనకాల వస్తున్న మరో లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులైన రాజేశ్, సుజాత దంపతులు, వారి కుమారుడు ఆశ్రిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్.. వైరా మండలం విప్పలమడక.. స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ఇంటికి చేరుతారనగా మృత్యువు కబళించింది. దీంతో విప్పలమడకలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో ఘటనలో జిల్లాలోని పెనుబల్లి వీఎం బంజర జరిగింది. బంజర సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. వాటిలో రెండు లారీల డ్రైవర్లిద్దరూ ఇరుక్కుపోయారు. బయటికి రాలేక, ఊపిరి ఆడక రెండు గంటలపాటు నరకం చూశారు. పోలీసులు.. రెస్క్యూ టీం సాయంతో వారిని రెండుగంటల తరువాత బైటికి తీశారు. కానీ తీవ్రంగా గాయపడడం, ఊపిరిఆడకపోవడంతో బైటికి తీసిన కాసేపటికే వీరిద్దరూ మృతి చెందారు.
మూడో ఘటన కల్లూరు మండలం రంగంబంజరలో చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయితేజ అనే యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.