టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని గత కొన్ని రోజులుగా పలువురు నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఇక ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశాలు ఇచ్చింది. మీడియా వద్ద బహిరంగ ప్రకటన చేయవద్దని సూచించింది. కూటమి నేతలు కూర్చుని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని స్పష్టం చేసింది.
ఇటీవల చంద్రబాబు మైదుకూరు పర్యటనలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరాడు. ఆ తర్వాత కూడా పలువురు నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి సున్నితమైన అంశంపై వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దని అధిష్టానం సూచించింది. ఇలాంటి విషయాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది.