స్వతంత్ర వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. అతడి బ్యానర్ లో తొలి సినిమాగా ఎల్‌జీఎం’(లెట్స్ గెట్ మ్యారీడ్) తెరకెక్కింది. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, ఇవానా జంటగా నటించారు. నదియా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో (జులై 10న) ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ధోనీతో పాటు అతడి భార్య సాక్షి ధోనీ కూడా పాల్గొన్నది.
ఇక ‘ఎల్‌జీఎం’(లెట్స్ గెట్ మ్యారీడ్) ట్రైలర్ వినోదం, భావోద్వేగాల మేళవింపుతో నిండిపోయింది. మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్, తన తల్లికి దూరంగా ఉండటం ఇష్టం ఉండదు. మీరాను పెళ్లి చేసుకుని తన తల్లితో కలిసి జీవించాలనుకుంటున్నాడు. మీరా ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉంటుంది. కూర్గ్ వెకేషన్ కు వెళ్లాలని ఇద్దరు భావిస్తారు. ఈ హాలీడే ట్రిప్ సందర్భంగా తమ బంధం మరితం బలపడుతుందని గౌతమ్ నమ్ముతాడు. అతడి ప్లాన్ అనుకున్నట్లు వర్కవుట్ అయ్యిందా? ఇవానా అత్తగారితో హాయిగా ఉంటుందా? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలను ఈ ట్రైలర్ లో ప్రస్తావించారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే, నిర్మాణ విలువలు రిచ్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఫన్నీ, ఎమోషనల్ కథ అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఎల్‌జీఎం’(లెట్స్ గెట్ మ్యారీడ్) విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. దర్శకుడు రమేష్ ఈ చిత్రానికి సంగీతం కూడా అందించారు.
‘ఎల్‌జీఎం’ సినిమా గురించి ధోనీ కీలక విషయాలు చెప్పారు. ఈ సినిమా ముగ్గురి చుట్టూ తిరిగే ఓ సరదా కథగా చెప్పారు. తల్లి, భార్య మధ్య నలిగిపోయే పాత్రలో హీరో అద్భుతంగా నటించారని వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమా అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న తమిళ సినిమా అని చెప్పారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనేదే తమ కోరిక అన్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ గురించి తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఈ సినిమా పనులన్నీ సాక్షి దగ్గరుంచి చూసుకున్నట్లు వెల్లడించారు. ఐపీఎల్ షురూ అయినప్పటి నుంచి తమిళనాడు తనను దత్తత తీసుకుంటన్నారు. తన టెస్ట్ మ్యాచ్ కూడా చెన్నై నుంచి మొదలైనట్లు చెప్పారు. క్రికెట్ లో తనకు మంచి అనుభవాలను అందించిన తమిళ నాడు, సినిమాల్లోనూ అందిస్తుందని భావిస్తున్నట్లు ధోనీ చెప్పారు.