ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కేసుకు సంబంధించి నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. కోర్టులో చెప్పదలుచుకున్న అంశాలను లేఖలో రాశానన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని..తాను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవని కవిత లేఖలో పేర్కొన్నారు. వేరే వ్యక్తుల స్టేట్ మెంట్ ఆధారంగా తనను అరెస్ట్ చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండున్నరేళ్ల విచారణలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కవిత చెప్పారు. తనను జైలులో సీబీఐ ప్రశ్నించిందని వివరించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతిని వ్వడంతో.. వారు కవితను కలిశారు.


