నాది నాది నాదన్నది నీది కాదురా..! నేడు నీదన్నది నిన్న వేరొకరిది, రేపు మరొకరిది, లేరెవరు, నీకెవరు…ఇలా పాటలైనా, పద్యాలైనా, నీతి వ్యాఖ్యలైనా, హితబోధలైనా…అన్ని చెప్పేవి ఒకటే..ఏవి వెంటరావు. తన వెంట రాకపోయినా.. తన తదనంతరం తమ వాళ్ల ఇంట ఇవన్నీ ఉంటే తన ఆత్మకు శాంతే కదా..అని కొందరు వ్యాఖ్యానించవచ్చు. అయితే, పెళ్లిళ్లు, నా వాళ్లు, సొంతవాళ్లు..అనే బంధాలు లేనివాళ్లు..పెద్ద పెద్ద హోదాల్లో, ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించి కాలం చేస్తే మరి ఆ వ్యక్తుల అపార ఆస్తులు, సంపదలు ఎవరికి చెందుతాయి.. అంటే.. కొంత సందిగ్ధతే కనిపిస్తుంది.
ఈ తరహాలో ఉండే.. ఆ ఆస్తులు సర్కారుపరం అవ్వవచ్చు అని ఎవరైనా చెబుతారు. ఇప్పుడు.. అవ్వవచ్చు కాదు.. అయిపోయింది. తొలుత సినీ వినీలాకాశంలో అనంతరం రాజకీయ రంగంలో జయలలిత ఎంతో పేరు ప్రతిష్ఠలు పొందారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎంజీ రామచంద్రన్ అనంతరం అన్నా డిఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి, ఆమె ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలన చేశారు. పేదల పెన్నిధిగా, అమ్మగా తమిళనాడు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఆమె పొందారు.
తమిళనాడులో ఏనాడు జాతీయ పార్టీలకు స్థానం లేకపోవడం విశేషం. ఆ రాష్ట్రంలో ఎప్పుడూ అన్నా డిఎంకే, డిఎంకేల మధ్యే పోటీ. ఏదో ఒక పార్టీ అధికార పగ్గాలు చేపట్టి పాలన సాగించడమే ఆనవాయితీ. సిద్దాంతాలు, పార్టీ పరంగా ఎంత వైరం ఉన్నా.. ప్రజల సంక్షేమం, పథకాలు విషయంలో.. తమిళనాట ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకేబాటలో వెళ్లడం విశేషం. ఆయా పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేర్చడంలో రెండు పార్టీలకు ఎప్పుడూ ప్రశంసలే. అందుకే, ఆ రెండు పార్టీలపైనా ఆ రాష్ట్ర ప్రజలకు అంత గురి. కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత అవివాహిత. ఆమె 2016లో మరణించారు. ఆమె మృతి అనంతరం ఆమె ఆస్తుల విషయం సంధిగ్ధావస్థలో పడింది.
తొమ్మిదేళ్ల క్రితం తనువు చాలించిన జయలలిత…తొలుత ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దోషిగా తేలారు. ఆమె మరణానంతరం ఈ కేసు విచారణను న్యాయస్థానం నిలిపివేసింది. అయితే, జయలలితపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసిన కారణంగా, ఆమె ఆస్తుల జప్తు తగదని ఆమె తరఫు బంధువులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సాగించిన న్యాయస్థానం, ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధారించిందని, అందువల్ల ఆస్తులు జప్తు చేయవచ్చని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీం సమర్థించింది.
జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్ పై కర్నాటక హైకోర్ట్ విచారణ చేసింది. గత జనవరి 1న పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, జయలలిత ఆస్తులకు సంబంధించి తాజాగా సీబీఐ కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు చెన్నైలో ఉన్న పోయెస్ గార్డెన్ నివాసం, వేద నిలయం, డీఏ కేసుతో ముడిపడివున్న పలు భూములు, ఆమెకు చెందిన ఓ ఎస్టేట్ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. అదే రీతిలో ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తులు, బంగారు ఆభరణాలు.. సీబీఐ కోర్ట్ ఆదేశాల ప్రకారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వపరం కానున్నాయి.