రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల్లో నమ్మకం చాలా ముఖ్యం. ఒకసారి ప్రజల్లో నమ్మకం కోల్పోతే ఆ తరువాత ఏం చెప్పినా జనం ఎవరూ విశ్వసించరు. తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం అదే పరిస్థితి. వాలం టీర్ల వ్యవస్థపై గతంలో తెలుగుదేశం పార్టీ నిప్పులు కక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న వాలంటీర్లపై ఉద్దేశ పూర్వకంగా నిందలు ప్రచారం చేసింది. అవ్వా తాతయ్యలకు పెన్షన్ అందకపోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణమంటూ దుష్ప్రచారం చేసింది. అయితే పసుపు పార్టీ నేతల ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించలేదు.
వాలంటీర్ల వ్యవస్థపై చేసిన దుష్ప్రచారం వర్క్ అవుట్ కాకపోవడంతో మరో అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే గులకరాళ్ల రాజకీయం. నిన్న మొన్నటివరకు గులకరాయి రాజకీయాలు నడిపింది తెలుగు దేశం పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే…ప్రజల సానుభూతి కోసం రోడ్ షోలో తనపై గులకరాయి వేయించుకున్నా రంటూ విష ప్రచారం చేసింది. అయితే పసుపు పార్టీ నేతల ప్రచారాన్ని ఈసారి కూడా ప్రజలు విశ్వసించలేదు. ఒక్కొటొ క్కటిగా కుట్రలన్నీ ఫెయిల్ కావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాదనను తాజాగా తెరమీదకు వచ్చింది తెలుగు దేశం పార్టీ. అంతేకాదు. ఊహించని విధంగా ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చింది. ఈ అస్త్రంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని వ్యూహాలు పన్నుతోంది పసుపు పార్టీ.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే అవాస్తవాలను ప్రచారంలోకి పెట్టింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదు. దీంతో తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాదనను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి టీడీపీ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల వ్యక్తిగత ఆస్తులపై హక్కును లాక్కోవడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిందని ఊరూ వాడా ఏకం చేస్తూ తెలుగుదేశం పార్టీ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనపై ప్రజల్లో అనుమానాలు కలగడం జగన్మోహన్ రెడ్డి సర్కార్ గమనించింది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా తమపై బురద చల్లుతున్న విషయాన్ని పసిగట్టింది. ఈ నేపథ్యంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేయడానికి వివరణ కూడా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులో ఉందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే, భూములు, భూములకు సంబంధించిన వివాదాలకు తెరపడుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాదనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. భూముల వివాదాలకు సంబంధించిన నిపుణులతో సంప్రదింపులు జరిపింది. న్యాయ కోవిదులతో మాట్లాడింది. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాదనకు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడో విషయం ప్రస్తావించుకుని తీరాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాదనతో నీతి ఆయోగ్ సంస్థకు సంబంధం ఉంది. భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఒక సమగ్ర చట్టం చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను నీతి ఆయోగ్ కోరింది. అంతేకాదు భూముల వివాదాలకు సంబంధించి కొంతకాలం కిందట రాష్ట్ర ప్రభుత్వా లకు నీతి ఆయోగ్ కొన్ని సూచనలు చేసింది. నీతి ఆయోగ్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా దాదాపు పదకొండు రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి ఒక ముసాయిదాను రూపొందించు కున్నాయి. భూ వివాదాలకు ఎండ్ కార్డ్ వేయాలని జగన్ ప్రభుత్వం ఎప్పటినుంచో భావిస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తులో భూ వివాదాలకు ఎండ్ కార్డ్ వేయడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ అయింది. అంతేకాదు ఈ చట్టంపై ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెగేసి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్థాయిలో వివరణ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఊరుకోలేదు. భూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే చట్టం ప్రతిపాదనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం మొదలెట్టింది. న్యాయవాదులను ఉసికొల్పిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనలు చేశారు. కొంతమంది ప్రభుత్వ ప్రతిపాదనను సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశమంతా అమలయ్యాకే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ విన్నవించింది. ఇదిలా ఉంటే, ఎన్నికలు తరుముకువస్తున్న తరుణంలో లాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనను ఒక ఆయుధంగా తీసుకుని జనంలోకి వెళుతోంది తెలుగుదేశం పార్టీ. లాండ్ టైటిలింగ్ ప్రతిపాదన చట్ట రూపం దాలిస్తే, రాష్ట్రంలోని కోట్లాది ఎకరాల భూములను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాజేస్తారంటూ దుష్ప్రచారం మొదలెట్టింది. అయితే కోట్లాది ఎకరాల భూములను నిబంధనలను తుంగలో తొక్కి, జగన్మోహన్ రెడ్డి ఎలా కాజేస్తారన్న ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాదు సోషల్ మీడియాలో గత ఐదు రోజుల్లో లాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనపైనే పోస్టులు, మీమ్స్ హల్‌చల్ చేస్తు న్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మరోసారి గెలిస్తే, వ్యక్తిగత ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పోస్టులతో భయపెట్టేస్తు న్నారు. స్వంత భూములు అమ్ముకోవాలన్నా, రెవిన్యూ అధికారుల అనుమతి తీసుకోవలసి ఉంటుందని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. మొత్తానికి సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో విధంగా బద్నం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యాని స్తున్నారు.