25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలకు 43 ఏళ్లు

 తుపాకీ తూటాల వర్షానికి, ఇంద్రవెల్లి రక్తపాతానికి నేటికి 43 ఏళ్లు. జల్..జంగిల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీలు కదం తొక్కిన రోజది. భూమికోసం, భుక్తి కోసం జరిగిన పోరాటంలో ఖాకీల తూటాలకు ఎందరో గిరిజనులు బలైన రోజది. దశాబ్ధాలు గడిచినా ఆకుపచ్చని అడవి ఎరుపురంగును పులుముకు న్న ఆ నెత్తుటి గాయం ఇప్పటికీ చెదిరిపోలేదు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాంతం అమరవీరుల త్యాగాలకు చిహ్నం. ఇంద్రవెల్లి పేరు చెబితే ఆదివాసీ గిరిజనుల్లో సమరోత్సహం కనిపిస్తుంది. సరిగ్గా 43 ఏళ్ల క్రితం.. అంటే 1981 ఎప్రిల్ 20న తమ హక్కుల కోసం పిడికిలి బిగించి.. పోరాట యోధుడు కొమరంభీం స్పూర్తితో భూమికోసం, భుక్తి కోసం కదం తొక్కారు ఆదివాసీలు. జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో పోరుబాట పట్టారు. తాము సాగు చేసుకుంటున్న అటవి భూములపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఇంద్రవెల్లిలో భారీ ఎత్తున సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అడవిబిడ్డలు తరలివ చ్చారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు సభను రద్దు చేసుకోవాలని కోరారు. దీనికి ఆదివాసీలు ససేమీరా అన్నారు. అప్పటికే వేలాదిగా గిరిజనులు తరలిరావడంతో సభను నిర్వహించే తీరుతామని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో ఆదివాసీలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో ఓ గిరిజన మహిళను పోలీసులు చేయిపట్టి లాగి కింద పడేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్‌ ఆర్డీవోకు చేరవేయడంతో ఆయన కాల్పులకు అనుమతించారు. దీంతో పోలీసులు విచక్షణారహితంగా గిరిజనులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందమందికిపైగా అడవిబిడ్డలు అసువులు బాసారు. తుపాకీ తూటాలతో మరికొందరికి గాయాల య్యాయి. అయితే ఈ కాల్పుల్లో కేవలం 13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మృతి చెందిన కుటుంబాలతోపాటు గాయపడ్డ గిరిజనులకు ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పినా నేటికీ ఎలాంటి చేయూత అందలేదు.

  ఇంద్రవెల్లి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల గుర్తుగా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసులు 1986 ఏప్రిల్ 19న ఇంద్రవెల్లిలో స్థూపం ఏర్పాటు చేశారు.అయితే ఇంద్రవెల్లి పోరాట చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియద్దనే కుట్రతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దురుద్దేశ్యంతో డైనమెట్లతో స్థూపాన్ని పేల్చి వేసింది. అయినప్పటకీ మళ్ళీ మూడేళ్ల తర్వాత గిరిజనులు స్తూపాన్ని పునర్నిర్మించుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఏప్రిల్ 20న అమరులకు నివాళులర్పించాలంటే పోలీసుల ఆంక్షలు ఉండేవి. భయానక వాతావరణం, స్తూపం వద్ద ఇనుప బూట్ల శబ్ధం. ప్రజలకు భయాందోళన కలిగిస్తూ పోలీస్ బందోబస్తు, ఆంక్షలతో అతి కొద్ది మందికి మాత్రమే నివాళులు అర్పించడానికి అనుమతి ఇచ్చేది ప్రభుత్వం. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత నిషేదాన్ని ఎత్తివేయడంతో గత నాలుగేళ్లుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద వందాలది గిరిజనులు హాజరై ప్రత్యేక పూజలతో ఆదివాసీ సాంప్రదాయంతో నివాళుర్పిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం సంస్మరణ సభకు అనుమతులు లేకుండా కేవలం స్తూపం వద్ద నివాళులర్పించేందుకు మాత్రమే అనుమతించింది.

     ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్‌ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్‌ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు 97 లక్షల రూపాయలు కేటాయించారు. ఇక జల్, జంగల్, జమీన్లపై పూర్తి స్వేచ్చా అధికారాలు అదివాసులకు లభింపచేసిన ప్పుడే ఇంద్రవెల్లి అమరుల త్యాగాలకు అర్పించే ఘన నివాళి ఔతుందంటున్నారు అక్కడి గిరిజనులు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్