తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది.
తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. అయితే సిట్‌పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారురు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు.