లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ తెలిపారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని న్నారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతోందని కేటీఆర్ చెప్పారు.ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలానికి పెట్టాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలో ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి, సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.


