పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై BRS దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు, శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉపఎన్నికలు తప్పవన్న భావనలో ఉన్న గులాబీ పార్టీ ఆ దిశగా నేతలను సన్నద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించనుంది. ఇవాళ శేరిలింగంపల్లితో ప్రారంభించి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల వెంట వెళ్లకుండా పార్టీలో మిగిలిన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలతో కేటీఆర్ సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు. స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో రెండు రోజుల క్రితం సమావేశమై త్వరలోనే విసృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పది నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ విడివిడిగా సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు.
మొదటగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నేతలతో ఇవాళ కేటీఆర్ సమావేశం కానున్నారు. నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ తరపున కార్యక్రమాల నిర్వహణ, ఉపఎన్నికలకు సన్నద్ధత అంశాలపై వారికి వివరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. పది నియోజకవర్గాల్లో నేతలను ఉపఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ పడింది.