స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి ముందుగా గంభీరావుపేట మండలం గోరంట్యాలలోని పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఇక సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో వెయ్యి మంది వికలాంగులకు పనిముట్లును అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి వెంట తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌తోపాటు పలువురు నేతలు ఉన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే గౌస్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు చెన్నిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.