లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఘటనలో అరెస్టైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ములాఖత్ అనంతరం ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తెలుసంటూ హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టైన వారిని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని హెచ్చరించారు. ఈరోజు కొడంగల్ తిరగబడింది..రేపు తెలంగాణ తిరగబడుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తిరుపతిరెడ్డి ఫోన్‌లో ఆదేశాలిస్తుంటే.. అధికారులు పాటిస్తున్నారని విమర్శించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాబందులా మారారని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటన సమయంలో ఓ వ్యక్తి కులగణనలో పాల్గొన్నారని, అతనిని కూడా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.
అదే విధంగా ఓ ఐటీఐ విద్యార్థిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు కేటీఆర్. కలెక్టర్ లగచర్లకు వచ్చినప్పుడు ఆందోళనలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిపారు. లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేశారన్నారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు సీఎం కావాలనే రాజకీయ రంగు పులిమారన్నారు.
తన పదవి ఐదేళ్లే ఉంటుందని రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎకరం 60 లక్షల రూపాయలు ఉండే భూమిని 10 లక్షల రూపాయలకే లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. రేవంత్‌రెడ్డికి చేతనైతే తమతో కొట్లాడాలి తప్ప అమాయకులతో కాదని చెప్పారు.
ఇదిలా ఉండగా, తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. శుక్రవారం కోర్టుకు సెలవు కావడంతో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. కేసు వ్యవహారంలో పోలీసులు నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు లగచర్లలో కలెక్టర్‌పై దాడి పథకం ప్రకారమే జరిగిందని..ఈ కుట్ర కోణం వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ అధికాప పక్ష నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. ఈ ఘటనలో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.