తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనుడికి ఉదయం విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పాల్గొన్నారు.


