Kotamreddy Giridhar Reddy |వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తన ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు.. తనను సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేశారు. అప్పటినుంచి ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో ఆయన అధికారపక్షంలో అసమ్మతి నేతగా కొనసాగుతున్నారు. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి మాత్రం అధికారికంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీ(TDP)లో చేరుతున్నానని, ఈ కార్యక్రమానికి అందరూ తరలివచ్చి ఆశీర్వదించి మద్దతు తెలపాలని కోరుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), నారా లోకేష్(Lokesh) చిత్రాలున్న ఫ్లెక్సీలను నెల్లూరు నగరమంతా ఏర్పాటు చేశారు.
ఇవాళ ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించి.. అటు నుంచి తాడేపల్లికి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబునాయుడు సమక్షంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి(Kotamreddy Giridhar Reddy)తో పాటు పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాల ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన గిరిధర్‌రెడ్డి.. ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
Read Also: ఆ పరీక్షల గడువు మరో మూడు నెలలు పొడిగించండి : లోకేష్ లేఖ
Follow us on: Youtube Instagram