స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబయింది. కొండలు, లోయలు, సెలయేరుల నడుమ ప్రకృతి సౌందర్యంతో అలరాలుతున్న కొండగట్టులో ఈరోజు నుంచి ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా ఉత్సవ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. కొండగట్టులో ప్రసిద్ధి చెందిన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు సుమారు 2 లక్షల మంది దీక్ష పరులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండగట్టు పరిసరాల్లో 55 తాత్కాలిక, 64 శాశ్వత మరుగుదొడ్లను సిద్ధం చేశారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తులకు ఇబ్బంది లేకుండా 1500 నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేశారు. కొండగట్టు దిగువ, పైన ఏడు ప్రాంతాల్ల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు.


