చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడికి సంబంధించి కీలక విషయాలను రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని, దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్ కు చెందినవారని చెప్పారు. రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని నిందితులు డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో రంగరాజన్ పై దాడి చేశారుని డీసీపీ వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 7వ తేదీన రాఘవరెడ్డి 20మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే.
అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.
ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. సోమవారం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు సీఎం ఫోన్ చేశారు. ఫోన్ లో ఆయనను పరామర్శించారు ముఖ్యమంత్రి. ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలుకూరు ఆలయం సమీపంలోని రంగరాజన్ ఇంట్లోకి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనతో పాటు అడ్డొచ్చిన అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు.