స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలోని రేషన్ డీలర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డీలర్ల కమీషన్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీలర్లకు క్వింటాకు రూ. 70 కమీషన్ ఇస్తుండగా.. ఆ మెుత్తాన్ని డబుల్ చేసింది. అంటే ఇక నుంచి రూ. 140 కమీషన్‌గా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సెక్రటేరియట్‌లో మంత్రి హరీష్ రావు(Minister Harish Rao),గుంగుల కమలాకర్(Gungula Kamalakar), పలువురు ఎమ్మెల్యేలు రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
రేషన్ డీలర్లకు కమీషన్ పెంచటంతో పాటు వారికి హెల్త్ కార్డులు(Health cards) కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరోనా కష్ట సమయంలో ప్రాణాలు కోల్పోయిన రేషన్ డీలర్ల స్థానంలో వారి కుటుంబంలోని ఒకరికి రేషన్ డీలర్ షిప్ ఇచ్చేందుకు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు (Cm Kcr) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబసభ్యుల్లో ఒకరికి డీలర్‌షిప్ ఇవ్వనుండగా.. అర్హత వయస్సు పరిమితిని పెంచుతూ గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీలర్‌షిప్‌కు అర్హత వయస్సు 40 ఏళ్ల వరకు ఉండగా… ఆ పరిమితిని మరో పదేళ్లు అంటే 50 ఏళ్లకు పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. రేషన్ డీలర్‌షిప్ పొందే వ్యక్తికి కచ్చితంగా 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. అయితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు కోరే అవకాశం కూడా ఉంది.