స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించాడు కేసీఆర్.. అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ లో విరుచుకుపడ్దారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చుకున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారు. వీళ్ళు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండి కేసీఆర్? అంటూ నిలదీశారు.