స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తొలి ప్రసంగం చేశారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. నూతన సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకే బీఆర్ అంబేడ్కర్ పేరు సచివాలయానికి పెట్టామన్నారు.
సమైక్య పాలనలో నీళ్లు ఎలా వస్తాయని ఆనాటి పాలకులు ఎద్దేవా చేశారని.. కానీ నేడు వాటిని ఛేదించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. పునర్నిర్మాణ కాంక్షను కొంత మంది హేళన చేశారని.. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా?అని చిల్లర వ్యాఖ్యలు చేశారని.. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు.