స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గత కొన్నిరోజులుగా హోరాహోరీగా జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా.. సోనియా గాంధీ, రాహుల్ వంటి అగ్రనాయకుల నుంచి స్థానిక నేతల వరకు ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఇప్పటివరకు మార్మోగిన మైకులు సాయంత్రం నుంచి బంద్ కానున్నాయి.
224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మే 10వ తేదిన పోలింగ్ జరగనుంది. మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, 2 మంది ఇతరులు ఉన్నారు. బీజేపీ నుంచి 224 మంది, కాంగ్రెస్ 223(మిగిలిన స్థానం నుంచి మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీకి మద్దతు), జేడీఎస్ 207, ఆప్ 209, బీఎస్పీ 133, సీపీఐ(ఎం)4, జేడీ(యూ)8, ఎన్పీపీ నుంచి 2మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దక్షిణాదిన ఏకైక రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని మళ్లీ కాపాడుకోవాలని బీజేపీ పావులు కదపుతుండగా.. కర్ణాటకలో గెలిచి పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అటు కుమారస్వామి నేతత్వంలోని జేడీఎస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి మరోసారి కింగ్ మేకర్ అవ్వాలని తహతహలాడుతోంది.
దీంతో ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు గుప్పించాయి. మరోవైపు సర్వేలన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. దేశంలోనే కీలకమైన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో తెలియాలంటే ఫలితాలు రోజైన మే13 వరకు ఆగాలి.