Justice S Abdul Nazeer appointed as Andhra Pradesh Governor: ఈ ఏడాది 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యమో, లేదంటే ఎక్కువ కాలం గవర్నర్లు ఒకే దగ్గర ఉన్నారన్న కారణంతోనో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. కొందరినీ బదిలీ చేసింది. ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల్లోని ఏపీకి ప్రస్తుతం ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ కి బదిలీ చేశారు. అలాగే ఏపీకి తాజా మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను తీసుకువచ్చారు.
కొత్త గవర్నర్ గా వచ్చిన అబ్దుల్ నజీర్ మొన్నటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్ లో ఈయన కూడా ఒకరుగా ఉన్నారు. మొత్తం 12 మంది గవర్నర్లు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బదిలీ చేశారు.
మహరాష్ట్రకి కొత్త గవర్నర్ గా రమేశ్ బైస్ ను నియమించారు. ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఇప్పటి వరకు రమేశ్ జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణణ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ ప్రతాప్ లను నియమించారు.
వీరే కాకుండా అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియాలను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లద్ధాఖ్ ఎల్ జీగా ఉన్న ఆర్కే మాథూర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రాను ఆయన స్థానంలో నియమించారు.
ఏపీ రాష్ట్ర కొత్త గవర్నర్ గా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ వివరాల్లోకి వెళితే… 1958 కర్ణాటక రాష్ట్రంలోని బెలువాయిలో జన్మించారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతర కాలంలో శాశ్వత న్యాయమూర్తిగా కొనసాగారు. ఈ క్రమంలోనే 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.
ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. 2019లో చారిత్రాత్మక రామజన్మభూమి కేసు తీర్పు చెప్పిన ఐదుగురు బెంచ్ లో కూడా ఈయన ఒకరుగా ఉన్నారు. అయోధ్యలోని వివాదస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణ ఉనికి ఉందంటూ భారత పురావస్తుశాఖ ఇచ్చిన తీర్పును జస్టిస్ నజీర్ సమర్థించారు.
కొత్త సంవత్సరం 2023 జనవరి 4నే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. అతికొద్దిరోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా సిఫారస్ చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే తెలంగాణకు మాత్రం తమిళసైని మార్చలేదు. సీఎంకి, గవర్నర్ కి మధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న నేపథ్యంలో ఈమె బదిలీ అవుతుందని అంతా అనుకున్నారు గానీ…జరగలేదు. తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు బీజేపీ ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్న సీఎం కేసీఆర్ కి తమిళసై అయితేనే కరెక్ట్ అనుకున్నారో ఏమో తెలీదు. మొత్తానికి తెలంగాణ జోలికి రాలేదు.