26.4 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు జీవన్‌రెడ్డి!

ఒక్కడు…ఒకే ఒక్కడు.. అవును తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక సభ్యుడు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్‌ను చిత్తు చేస్తూ 64 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా శాసన మండలిలో మాత్రం హస్తం పార్టీ బలం గురించి చెప్పుకోడానికి ఏమీ లేదన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పార్టీ తరఫున జీవన్ రెడ్డి ఒక్కరే ఆరం భారం మోస్తున్నారు.

అవసరమైన బలం అసెంబ్లీలో ఉంది కదా…మండలి సంగతి ఇప్పుడెందుకు అంటారా… అక్కడికే వస్తున్నాం.. ఆరు గ్యారెంటీలు సహా పలు హామీలతో ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. మరిప్పుడు హామీలు అమలు చేయాలంటే వివిధ అంశాలకు సంబంధించిన బిల్లులు తేవాల్సి ఉంటుంది. చట్టాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ జరగాలంటే శాసనమండలి అత్యంత కీలకం.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం, శాసన మండలి సభ్యుల సంఖ్య, రాష్ట్ర శాసన సభ సీట్ల సంఖ్యలో మూడింట ఒకవంతు మించకూడదు. దీని ప్రకారం తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు అవకాశముంది. ప్రస్తుతం 34 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎమ్మెల్సీల సంఖ్య 38గా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు తమ పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 34కి తగ్గింది.

40 స్థానాలున్న మండలిలో బీఆర్ఎస్‌ బలం 27 మంది సభ్యులు. ఎమ్మెల్యే కోటాలోని 12 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది, స్థానిక సంస్థల కోటా 13 మందిలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఒకరు, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మరో నలుగురు ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ తరఫున ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఇద్దరు, బీజేపీ, పీఆర్టీయూ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు చొప్పున మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందర్నీ మినహాయిస్తే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఆయనే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జీవన్‌ రెడ్డి. అయితే… అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పైకి ఇద్దరుగా కన్పించినా అధికారికంగా మాత్రం ఒక్కరి కిందే లెక్క.

మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమలు కోసం.. పలు బిల్లులు మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ చూస్తే ఇబ్బందికర పరిస్థితి. ఇంకా చెప్పాలంటే పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఎదురైన పరిస్థితులే ఇక్కడా కన్పిస్తాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో 151 సీట్ల బలంతో వైసీపీ సర్కారు ఏర్పడింది. కానీ, అప్పటికి టీడీపీ బలం మండలిలో ఎక్కువగా ఉంది. దీంతో… జగన్ ప్రభుత్వానికి చుక్కలు కన్పించాయి. ఏపీ రాజధాని వికేంద్రీకరణ 2020 బిల్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సహా పలు బిల్లులు మండలిలో తిరస్కరణకు గరయ్యాయి. దీంతో.. పెద్దల సభపై విసుగెత్తిన జగన్ ప్రభుత్వం చివరకు మండలినే రద్దు చేసే వరకు వెళ్లింది. ఆ తర్వాత వెనక్కు తగ్గినా, బలం పెరిగికే కాస్త ఊపిరి పీల్చుకుంది జగన్ ప్రభుత్వం.

వాస్తవానికి నిబంధనల ప్రకారం రాష్ట్ర శాసన సభలో ఆమోదం పొందిన బిల్లు, మండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి చేరుతుంది. మండలిలో బిల్లుపై చర్చించి సవరణలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లును మండలి సభ్యులు వ్యతిరేకించినా, లేదా సవరణలు సూచించినా శాసన సభకు తిరిగి పంపిస్తారు. ఒకవేళ బిల్లుపై మండలి చైర్మన్ చర్చకు అనుమతించి, ఆ బిల్లును మండలి వ్యతిరేకిస్తే, బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళ్తుంది. అలా మండలి నుంచి వెనక్కి వచ్చిన బిల్లును శాసన సభ రెండోసారి ఆమోదిస్తే, మళ్లీ అది శాసన మండలికి వెళ్తుంది. అయితే.. రెండోసారి సంబంధిత బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే, ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదంతో అది చట్టంగా మారుతుంది.

మొత్తంగా చూస్తే… అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వానికి తిరుగులేకపోయినా… మండలిలో మాత్రం అంత సులువు కాదన్న వాదన బలంగా విన్పిస్తోంది. మరి… ఈ విషయంలో రేవంత్ సర్కారు ఏం చేస్తుంది ? అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే అని చెప్పక తప్పదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్