స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో పొత్తులపై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకు కచ్చితంగా పొత్తులతోనే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఒకప్పుడు పొత్తులు పెట్టుకునే బలపడ్డాయని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నా.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. పొత్తులకు సీఎం పదవి ప్రామాణికం కాదని.. తాను అలాంటి కండిషన్లు పెట్టనని తెలిపారు.
గత ఎన్నికల్లో తనకు ఓ 30-40 సీట్లు ఇచ్చి ఉంటే కచ్చితంగా సీఎం రేసులో ఉండేవాడినని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలకు చెక్ పెట్టేందుకు బలమున్న ప్రధాన పార్టీలు కలిసి నడవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం జూన్ నెల నుంచే ప్రజల్లో ఉంటానని.. వైకాపా దాష్టీకాన్ని బలంగా ఎదుర్కొంటామని జనసేనాని స్పష్టం చేశారు.