Janasena pawankalyan kondagattu tour: జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల కదనరంగంలోకి ఉత్సాహంగా దూకేందుకు సిద్ధమయ్యారు. పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. ఆఖరికి సెంటిమెంట్ పరంగా కూడా ఆయన ప్రచార రథం వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. వేదపండితుల పూజల అనంతరం పవన్ కల్యాణ్ వారాహిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వందలాది జనసైన సైనికులతో కలిసి ఆయన కొండగట్టుకి వచ్చారు. అత్యంత ఉల్లాసభరితంగా కార్యక్రమం జరిగింది.
అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్ లో తెలంగాణ ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు. అక్కడ నుంచి ఆయన జనసైనికులతో కలిసి ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అక్కడ నుంచి నారసింహ క్షేత్రాలను తిరిగేలా రూపొందించిన ‘అనుష్టుప్ నారసింహ’ యాత్రకు శ్రీకారం చుడతారు.
పవన్ కల్యాణ్ ఇక నుంచైనా భాషఃపై ప్రేమతోనో, లేదంటే ఎవరికీ తెలియని పేర్లు పెట్టాలనే కాంక్షతోనో తెలుగు భాషలో నోరు తిరగని పేర్లతో వాహనాలకు, కార్యక్రమాలకు పేర్లు పెట్టవద్దని పలువురు సూచిస్తున్నారు.
ఎందుకంటే తన అభిమానులు అందరూ సామాన్యులే కాబట్టి, ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం పుణ్యమా? అని అంతా ఇంగ్లీషు మీడియం చదువులే కాబట్టి, మనుషులు మాట్లాడుకునే సాధారణ వాడుక భాషలోనే వాహనాల పేర్లు, కార్యక్రమాల పేర్లు పెడితే జనాల్లోకి త్వరగా వెళతాయని అంటున్నారు. వారాహి, ‘అనుష్టుప్ నారసింహ’ ఇలాంటివాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని సాధారణ పౌరులు సూచిస్తున్నారు.
లేకపోతే ఎవరికీ నోరు తిరగక, అది వేరే పేరుగా మారి, అలాగే స్థిరపడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ‘‘అయ్యవారిని చేయబోతే కోతి అయ్యింది’’ అన్న చందంగా మారిపోతుందని అంటున్నారు. చివరికి అది వైసీపీవాళ్ల చేతిలో ఆయుధంగా మారే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. అప్పుడు ప్రోగ్రాం కాన్సెప్ట్ మారిపోయి, కామెడీ అయిపోతుందని అంటున్నారు.