రోడ్ షోలు, పాదయాత్రలపై కఠిన ఆంక్షలు విధిస్తూ జీవో జారీ
చంద్రబాబు నాయుడి సభల్లో రెండు సార్లు తొక్కిసలాట అంశాన్ని వైసీపీ ప్రభుత్వం మరోలా వాడుకుంటోంది. ప్రజలకు రక్షణ కల్పించకుండా.. ఇరుకు ప్రాంతాల్లో రోడ్ షో లు చేయటం ఇబ్బందికరంగా ఉంటోందన్న కారణం చూపుతూ.. అటువంటి కార్యక్రమాల్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. ఈ ఆదేశాల ప్రకారం విశాలమైన ప్రాంగణాలలోనే సభలు, సమావేశాలకు అనుమతులు ఇస్తారు. తగిన అనుమతులు లేకుండా సభలు పెట్టాలనుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు రోడ్ షోలకు విపరీతంగా జనం వస్తున్నారు. ఈ రోడ్ షోలన్నీ దాదాపుగా ప్రధాన కూడళ్లలోనే నిర్వహిస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఇకపై పోలీసు అధికారులు ఇటువంటి ప్రదేశాలలో అనుమతులు ఇవ్వకపోవచ్చు. ఊరవతల ఖాళీ ప్రదేశాలలో మీటింగ్ పెట్టుకోమని చెబుతుంటారు. అప్పుడు జనసమీకరణ అన్నది చాలాకష్టం అవుతుంది. అలాగే లోకేష్ పాదయాత్రకు కూడా ఇది గండంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహితో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోడ్ షోలకు కూడా ఇప్పుడు ఇబ్బంది తప్పేట్లు లేదు. పవన్ కళ్యాణ్ వాహనం భారీగా ఉంటుంది కాబట్టి ఈ వాహనాన్ని పట్టణాల్లోకి అనుమతించకుండా ఊర్లకు దూరంగా నిలిపివేయించే ప్రమాదం ఉంది. అదే జరిగితే అక్కడకు జనసమీకరణ చేయించటం జనసేన పార్టీకి తలకు మించిన భారం అవుతుంది.
బ్రిటీష్ కాలం నాటి ఉత్తర్వులకు దుమ్ము దులిపి, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే, ఇటువంటి చీకటి జీవోలు న్యాయస్థానాలలో నిలవక పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. హైకోర్టుకి వెళితే ఈ జీవో వీగిపోతుందని విపక్ష నేతలు బలంగా చెబుతున్నారు. ఈ జీవో విషయంలో ప్రభుత్వానికి కచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేస్తున్నారు.