స్వతంత్ర వెబ్ డెస్క్: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా 7 వేల 500 చొప్పున పెట్టుబడి సాయంతో పాటు.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని.. సీఎం జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా ఐదో ఏడాది ‘రైతు భరోసా’ తొలి విడత నిధులు విడుదల చేసామన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతులకు అన్నివిధాలా అండగా ఉంటున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఏ సీజన్ ఇన్‌పుట్ సబ్సిడీని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నామన్నారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శ అస్త్రాలు కురిపించారు జగన్.. చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు. పర్సనాలిటీ లేదు. క్యారెక్టర్ లేదు. క్రెడిబిలిటీ అంతకన్నా లేదు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి లేరు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.. ఏ గడ్డైనా తింటారు. ఒక్కఛాన్స్ ఇస్తే ఏదో చేస్తా అంటున్నాడు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబిలీటీ ఉంటుంది. కానీ, చంద్రబాబు మోసంగా మార్చేశారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుతక్తులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు. చంద్రబాబు సత్యాన్ని పలకరు.. ధర్మానికి కట్టుబడరు. విలువలు, విశ్వసనీయత రెండూ లేవు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు.
చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. కరువు పరిస్థితులు తప్ప మరేం లేవు. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. అసలు ఆయన పాలనలో ఈ-క్రాప్ అనే మాటే లేదు. సోషల్ అడిట్ అనేది లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు.. వలసలు లేవు. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు అవుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకూ, మీ బిడ్డ పాలనకూ తేడా చూడండని ప్రజలను కోరారాయన.
రైతుకు శత్రువు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఆయన. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు. నిండా అన్నదాతల్ని ముంచేశాడు. మేం మాత్రం రైతన్నకు అదనపు ఆదాయం రావాలనే లక్ష్యంతో పథకాలు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ అమూల్‌ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్‌పేరుతో దోచుకున్నవారికి అడ్డుకట్ట వేశాం. అమూల్ ధర పెంచాక హెరిటేజ్ కూడా పెంచింది. దళారులు లేకుండా రైతులు పంటను అమ్ముకునే పరిస్థితి కల్పించాం. నమ్మిన రైతులు, పొదుపు సంఘాలు, యువత సహా అవ్వాతాతలను మోసం చేసి అప్పులపాలు జేశాడు చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవన్నారు. గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడాలని.. మహానేత వైఎస్సార్ జయంతి రోజున ఇస్క్యూరెన్స్ కూడా జమ చేస్తామంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.