వైఎస్సార్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని అన్నారు.. ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ విజయమ్మ ముందుకు రావాలని.. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవద్దని బాలినేని కోరారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.