‘బతుకుదెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది. మంత్రులు లోకేశ్, పవన్ కల్యాణ్ స్పందించి దయచేసి నన్ను మా ఊరికి రప్పించండి.’ అంటూ కన్నీటిపర్యంతమైంది ఓ మహిళ. తనను కువైట్ నుంచి రప్పించాలని వేడుకుంటోంది.
మంత్రులు లోకేశ్, పవన్ కళ్యాణ్‌కు కువైట్ నుండి పంపిన వీడియో శుక్రవారం స్థానికంగా వైరల్ అయ్యింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన పందిరి అమ్ములు ఆరు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్‌లో ఇళ్లలో పని చేసేందుకు వెళ్లింది. 55 ఏళ్ల వయసున్న ఆమె అక్కడివారు చెప్పే పరిమితికి మించిన పనులు చేయలేకపోయారు. దాంతో ఎవరూ పనిలో పెట్టుకోవడం లేదు. ఏజెంట్‌ను అడిగితే రూ.2 లక్షలు కడితేనే పంపిస్తానంటూ గదిలో బంధించాడు. వేధింపులు భరించలేకున్నా.. అని ఆమె రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు లోకేశ్, పవన్ కళ్యాణ్‌ను ప్రాధేయపడుతూ వీడియో సందేశాలను కాకినాడ జిల్లా ఉప్పాడలోని తన కోడలు దుర్గకు పంపించారు. అమ్ములును కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.