హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా సోదాలు చేశారు. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.
అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరిపారు. చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.