స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు పంచుతున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటిదాకా రూ.300కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును జప్తు చేశారు. కేవలం రాజధాని బెంగళూరులోనే రూ.82 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా మైసూరులో కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి ఇంట్లోని పెరట్లో చెట్టుపై దాచిన కోటి రూపాయలను గుర్తించారు. పుత్తూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో పెరట్లోని మామిడి చెట్టుపై ఏవో బాక్సులు ఉండటం గమనించారు. ఆ బాక్సులను కిందకి తీసి చూడగా అందులో దాదాపు కోటి రూపాయల డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. సరైన లెక్కాపత్రాలు చూపించకపోవడంతో మొత్తం డబ్బును సీజ్ చేశారు.