స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ మంత్రి అంబటి రాంబాబు తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. బాబు అరెస్ట్ వార్త విని మరణించారనడం ఓ జోక్ అని కొట్టిపారేశారు. మరణించినవారిని పరామర్శించడానికి వెళ్లడం మరో జోక్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎందుకురా జోకులేసి చంపుతారు? అంటూ అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. అయితే అంబటి ట్వీట్ పట్ల నెట్టింట మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో వైఎస్సార్ చనిపోయినప్పుడు కూడా చాలామంది మరణించడం, వారిని ఓదార్చడం కూడా జోకేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోగ్యం పైన స్పందించిన మంత్రి అంబటి.. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు.. కానీ, చంద్రబాబుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఇప్పటి వరకు కోర్టులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. 35 రోజులుగా ఏనాడూ చంద్రబాబు లాయర్లు, తమ క్లయింటుకు ఏసీ కావాలని కోర్టులో పిటిషన్ వేయలేదన్నారు. అంటే దీని అర్థం ఏమిటని నిలదీసారు. గురు, శుక్రవారాల్లో వాదనలు సాగినప్పుడు కూడా ఈ విషయాన్ని కోర్టులో అడగలేదని గుర్తు చేసారు. కోర్టు ఏం చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తుందని స్పష్టం చేసారు. ఖైదీలకు ఏం ఇవ్వాలో, ఏం ఇవ్వకూడదో నిర్ణయించేది కోర్టు అయినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.