స్వతంత్ర వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నావిగేషన్ ఉపగ్రహం ‘ఎన్‌వీఎస్–01’ ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ నెల 29న ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్ 12 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టనుంది. ఇక, శ్రీహరికోటలో ప్రయోగ ప్రక్రియను శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.. 27.30 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ తర్వాత రేపు ఉదయం 10.42 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు..
ఈ ప్రయోగాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించింది. అయితే షార్‌లోని వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి దాని చుట్టూ ఉష్టకవచాన్ని(హీట్‌షీల్డ్) అమర్చే ప్రక్రియ పూర్తిచేశారు.
2,232 కిలోల బరువుండే ఈ శాటిలైట్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో ప్రవేశ పెట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్ (నావిక్) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్–01 మొదటిది. నావిక్ అనేది అమెరికాకు చెందిన జీపీఎస్ తరహాలోనే భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంటోంది. దేశ సరిహద్దులో 1500 కిలో మీటర్ల మేర నావిక్ కవరేజ్ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపరిచింది. ఈ సిరీస్‌లో ముందుగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జి (IRNSS-1G) ఉపగ్రహ సేవలు నిలిచిపోయాయి. దీని స్థానంలో ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు సేవలందించనుంది. రాకెట్‌కు ల్యాంచ్ ప్యాడ్ వద్దకు చేర్చి తుది పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ల్యాంచ్ ఆథరైజేషన్ బోర్డు, ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.