Nadendla Manohar | విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, బెవరపేట గ్రామస్థులు, మహిళలు భోరున విలపిస్తూ తమ బాధలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు తెలియజేశారు. ‘జాబ్ కార్డు కావాలంటే రూ.500… పాస్ బుక్ కావాలంటే రూ.3000, ఇల్లు కట్టుకునే బిల్లులో రూ.30 వేలు.. ఇలా ప్రతి పనికి లంచం. అన్ని విషయాల్లోనూ అవినీతి అన్నట్లు వైసీపీ పాలన సాగుతోంది. ఈ అవినీతి ప్రభుత్వం స్టిక్కర్లు ఇంటిపై అతికించుకునేది లేదని అడ్డు చెప్పినందుకు రక్తాలు వచ్చేలా, కాళ్లు, చేతులు విరిగేలా చావబాదారు. ఇదేనా ప్రభుత్వ న్యాయం.. ఇదేనా వైసీపీ ధర్మం?’ అంటూ నాదెండ్లకు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఈ నెల 22వ తేదీన బెవరపేటలో వైసీపీ నాయకుల దాష్టికంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 12 మంది జన సైనికులను నాదెండ్ల మనోహర్ శనివారంగ్రామానికి వెళ్లి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం చేయించేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని, దిగులుపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.
నాదెండ్లతో వారు మాట్లాడుతూ.. బాధితుల్లో ఎక్కువమందికి తీవ్ర గాయాలైనప్పటికీ వెంటనే డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఒకరికి 24 కుట్లు, మరొకరికి 12 కుట్లు, ఒకరికి చెవికి గాయం అయ్యి చెవి వినిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే డిశ్చార్జ్ చేశారన్నారు. కేసు తీవ్రతను తక్కువగా చూపించేందుకే ఈ చర్యలు చేపట్టారని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ… “గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలు బెవరపేట గ్రామస్తులు చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది. దొంగ మస్తర్లు వేసి, లేని పనులను ఉన్నట్లు చూపి డబ్బులు దండుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి దగ్గరే ఉండి వేలిముద్ర వేసిన వారికి 30 శాతం డబ్బులు చెల్లించి మిగతా డబ్బులను కాజేస్తున్నట్లు అర్థమవుతుంది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి పెట్టాలి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలని అన్నారు.


