పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణపై కేంద్రీకరిస్తోంది. క్లిష్టమైన బెంగాల్ కోటను బద్దలు కొట్టిన కాషాయ దళం, అదే ఉత్సాహంతో దక్కన్ గడ్డపై పాగా వేయాలని పక్కా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల పదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఇంతకీ బెంగాల్ గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసం తెలంగాణ కమలనాథుల్లో ఉన్న అంతర్గత విభేదాలను చెరిపేస్తుందా? సక్సెస్ ఫుల్ ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్ వ్యూహాలు దక్షిణాన ఒంటరిగా అధికారంలోకి రావాలన్న బీజేపీ కలను సాకారం చేస్తాయా?
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయం దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అక్కడ మళ్లీ మమతా బెనర్జీ దే అధికారం అని భావించిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కాషాయ జెండా రెపరెపలాడింది. ప్రారంభంలో గెలుపు అంత తేలిక కాదనుకున్నా, ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత ప్రచారం, అమిత్ షా అక్కడే మకాం వేసి రచించిన పక్కా వ్యూహాలతో బెంగాల్ సీన్ పూర్తిగా మారిపోయింది. పకడ్బందీ ఎలక్షనీరింగ్, హిందుత్వ అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం కమలానికి గెలుపు బాటలు వేశాయి. సామాజిక సమీకరణలు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ అధిగమించి బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. ఏమాత్రం అవకాశం దొరికినా అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న జాతీయ నాయకత్వ పట్టుదల అక్కడ అక్షరాలా ఫలించింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
బెంగాల్ విజయం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఒక బలమైన ప్రకంపనను సృష్టించింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు, బలమైన ప్రత్యర్థులు ఉన్న చోటే పార్టీ ఘన విజయం సాధించినప్పుడు, అంతో ఇంతో అనుకూలత ఉన్న తెలంగాణలో ఎందుకు గెలవలేమన్న చర్చ రాష్ట్ర నాయకుల్లో బలంగా మొదలైంది. బెంగాల్‌లోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి కేడర్ లేకపోయినా భారీ మెజారిటీతో పీఠాన్ని కైవసం చేసుకున్న తీరును తెలంగాణ కమలనాథులు ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీగా విశ్లేషిస్తున్నారు. ఈ విజయంతో స్థానిక కేడర్ లో ఒక కొత్త భరోసా ఏర్పడింది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే దక్కన్ గడ్డ మీద కూడా కాషాయ జెండా ఎగురవేయడం ఏమాత్రం కష్టం కాదన్న నిర్ధారణకు వచ్చారు. బెంగాల్ లో పనిచేసిన గ్రౌండ్ లెవల్ స్ట్రాటజీలను ఇక్కడ కూడా అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు. జాతీయ నాయకత్వం చూపుతున్న చొరవను అందిపుచ్చుకుని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
గెలుపు మీద ధీమా పెరుగుతున్నా, పార్టీ అంతర్గత పరిస్థితులపై మాత్రం నాయకుల్లో తీవ్ర అంతర్మథనం సాగుతోంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం ఒక ప్రధాన అవరోధంగా మారుతోందన్న వాస్తవాన్ని అధిష్టానం గుర్తించింది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైందని కేడర్ సైతం లోపలోపల మథనపడుతోంది. పశ్చిమ బెంగాల్ ఫలితాల తర్వాత ఈ అంతర్గత విభేదాలపై స్పష్టమైన ఆత్మవిమర్శ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్య నేతలందరూ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వస్తేనే అధికార పీఠం దక్కుతుందన్న విషయాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు. కేడర్ వాయిస్ కూడా ఇదే విధంగా ఉంది. నాయకుల మధ్య సమన్వయం కుదిరి, ఎవరికి వారు ఒంటరి పోరాటాలు కాకుండా ఒక ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళితే తెలంగాణలో కమలం వికసించడం వంద శాతం ఖాయమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. జాతీయ స్థాయిలో బెంగాల్ గెలుపు స్పష్టమవుతోందన్న పక్కా ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చిన తర్వాతే ప్రధాని తెలంగాణ పర్యటనకు సమయం కేటాయించినట్లు రాజకీయ వర్గాల్లో ఒక బలమైన వాదన వినిపిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ వెంటనే పార్టీ పరంగా నిర్వహించే ఒక భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సభ వేదికగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సమర శంఖం పూరించబోతోంది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తదుపరి అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అన్న స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి పంపడానికే మోదీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ పర్యటనతో రాష్ట్ర పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి, ఎన్నికల సమరానికి వారిని మానసికంగా సన్నద్ధం చేయనున్నారు.
దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా బీజేపీ కేవలం ఉత్తరాది పార్టీ మాత్రమే అనే ముద్రను పూర్తిగా చెరిపేసుకోవడానికి అధిష్టానం కంకణం కట్టుకుంది. దీనికోసం వాళ్ల ముందున్న ప్రధాన లక్ష్యాలు కర్ణాటక, తెలంగాణ. అయితే కర్ణాటకలో ప్రస్తుతం జనతాదళ్ సెక్యులర్ తో పొత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సొంత బలంతో, ఒంటరిగా అధికారంలోకి రాగల ఏకైక రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే కనిపిస్తోంది. అందుకే అధిష్టానం ఇకపై పూర్తి ఫోకస్ రాష్ట్రంపైనే పెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వ్యూహాలు ఇక్కడ కీలకం కానున్నాయి. ఆయనకు సంస్థాగత ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీ అద్భుతంగా అధికారంలోకి వచ్చింది. తన హ్యాట్రిక్ టార్గెట్‌గా బన్సల్ తెలంగాణను ఎంచుకున్నారు. ఆయన వ్యూహరచనతో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం తథ్యమని పార్టీ నాయకత్వం, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


