22.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

సిద్ధా రాఘవరావు వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారా..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చూసిన వైసీపీ నుంచి వలసలు జరుగుతూనే ఉన్నాయి. కూటమిలోని మూడు పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరిపోవాలని చాలా మంది వైసీపీ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పుడు.. ఎవరు రాజీనామా చేస్తారో? ఎవరు ఏ పార్టీలో చేరతారో అని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకప్పుడు వైసీపీలో వెలుగు వెలిగిన నేతలే ఇలా పార్టీ మారే విషయంలో ముందు వరుసలో ఉండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. మరి కొంత మంది టీడీపీలో చేరగా.. ఆ పార్టీలో చేరే అవకాశం లేని వాళ్లు జనసేన గూటికి చేరారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేసే యోచనలో ఉన్నారట. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కార్పొరేటర్లు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పడు అదే ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జగన్ మోహన్ రెడ్డిని విభేదించి వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లారు. ఆయన రాకను ఒంగోలు టీడీపీ, జనసేన నాయకులు వ్యతిరేకించినా.. పవన్ కల్యాన్ మాత్రం చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయం ప్రారంభించిన బాలినేనిని అప్పట్లో దివంగత సీఎం వైఎస్ఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. చిన్న వయసులోనే మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత జగన్ పంచన చేరి మరో సారి మంత్రి అయ్యారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా.. బాలినేని మాత్రం పార్టీ కష్టకాలంలో అండగా ఉండకుండా.. జనసేనలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు జనసేనలో తన పరపతిని పెంచుకోవడానికి.. వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు బాలినేని.

బాలినేని ఒత్తిడి చేయడంతో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన రాఘవరావు… చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేతగా కూడా గుర్తింపు పొందారు. 2014లో దర్శి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు రాఘవరావు. ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయనకు సామాజిక సమీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో దర్శి టికెట్ బదులు ఒంగోలు పార్లమెంట్ సీటు కేటాయించారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గత ఎన్నికల్లో రాఘవరావు దర్శి టిక్కెట్లు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇచ్చారు. అప్పటి నుంచే మనస్థాపంతో ఉన్న రాఘవరావు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాఘవరావు అలకబూనినా పార్టీ తరపున ఎవరూ వచ్చి మాట్లాడకపోవడంతో ఇక ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చారట. అంతే కాకుండా పాత మిత్రుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలోకి రావాలంటూ ఒత్తిడి చేయడంతో రాఘవరావు జనసేనలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధమున్న సిద్దా రాఘవరావు.. తొలుత ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు సార్లు చంద్రబాబును కూడా కలిశారు. తన మనసులో ఉన్న మాటను చెప్పారట. కానీ చంద్రబాబు నుంచి సానుకూల సమాధానం రాలేదని తెలిసింది. ఇదే సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని.. జనసేనలో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఒకటి రెండు రోజుల్లో రాఘవరావు పార్టీ మార్పుపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి జనసేనలో రాఘవరావుకు ఎలాంటి స్థానం దక్కుతుందో వేచి చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్