- విభజన హామీల గురించి చర్చించామని జగన్ ట్వీట్
- బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకే అని ఊహగానాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కలిశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించిన జగన్..ఆపై విన్నపాల చిట్టా విప్పారు. ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ట్వీట్ ప్రకారం.. ఈ భేటీలో విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి పెండింగ్ అంశాల మీద ప్రధానమంత్రి తో చర్చించినట్లు వెల్లడించారు. పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించినప్పుడు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారని కూడా తెలియచేశారు. మొత్తం మీద ఈ భేటీ సానుకూల వాతావరణంలోనే జరిగినట్లుగా ట్వీట్ చేశారు. సీఎం, పీఎం భేటీ కాబట్టి సహజంగానే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల మీద చర్చించి ఉంటారని అనుకోవటంతో తప్పు లేదు, పైగా సీఎం ట్వీట్ కూడా అదే నిర్ధారిస్తోంది.
అయితే, అంతకు మించి ప్రస్తుత వాతావరణంలో దీనిని రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు, అధికారం నుంచి దింపేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జనసేనను కలుపుకొనేందుకు మార్గం సుగమం చేసుకొంది. పనిలోపనిగా బీజేపీని కూడా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను ప్రస్తుత బీజేపీ నాయకత్వం కొంత వ్యతిరేకత కనబరుస్తుంటే, బీజేపీలోని పాత టీడీపీ నేతలు మాత్రం సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీని లాక్కొనేందుకు చంద్రబాబు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా గెలవాలని బీజేపీ నేతలు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు… సడెన్‌గా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అక్కడ తెలుగుదేశానికి క్రేజ్ ఉందని, టీడీపీని కలుపుకొంటే బీజేపీకి కలిసి వస్తుందనే ఫీలర్ వదిలారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు బీజేపీ వెళ్లి.. టీడీపీతో కలిస్తే… ఓట్ల పరంగా వచ్చే సమస్యల కంటే కూడా ఎన్నికల్ని ఎదుర్కొనే విషయంలో వైసీపీకి చిక్కులు ఏర్పడతాయి. ఇప్పటికిప్పుడు కేంద్రంతో కానీ, బీజేపీతో కానీ శత్రుత్వం పెట్టుకొనేందుకు జగన్ సిద్ధంగా లేరు. అటువంటప్పుడు ముందుగానే బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకొనేందుకు వైఎస్ జగన్ ఈ ఢిల్లీ పర్యటన పెట్టుకొన్నారన్న మాట వినిపిస్తోంది.