ఎన్నికల ప్రచార సందడి ముగియడంతో ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. ఒకటి రెండు గంటలు కాదు. ఏకంగా 45 గంటలపాటు ధ్యానంలో గడపనున్నారు. ఇందుకు మూడు సముద్రాల సంగమ స్థలి అయిన వివేకానంద రాక్ మెమోరి యల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మోదీ. మరి ప్రధాని ధ్యానానికి కారణమేంటి..?, ఇది ఒక రకమైన ప్రచారమేనంటున్న ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత..?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ధ్యానంలో మునిగారు. కన్యా కుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఆయన 45 గంటలపాటు ధ్యానం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ధ్యానం కొనసాగనుంది. ఈ మేరకు మోదీ గురువారం సాయంత్రమే తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుంచి భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెల్లటి ధోవతి, శాలువ ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ధ్యానానికి సమాయత్తమైన ప్రధాని ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకుని గురువారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల నుంచి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇక ఈ సమయం లో మోదీ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఓ వైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకోవైపు అరేబియా సముద్రం కలిసే మూడు సాగరాల సంగమ స్థలాన్ని మోదీ ధ్యానం చేయడానికి ఎంచుకున్నారు. అందుకు కారణం వివేకానంద స్వామి మూడు రోజులపాటు ఇదే ప్రాంతంలో ధ్యానంలో కూర్చుని జ్ఞానాన్ని పొందారన్న విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇదే స్థలాన్ని ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతన్నాయి. కాగా, 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానం దుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి, 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ మూడు సముద్రాలూ కలిసే చోట ఒక రాయిపై కూర్చుని మూడురోజులపాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని, తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని చెబుతుంటారు. ఇక ఆయన స్మత్యర్థం 1970లో అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు.
ఇదిలా ఉంటే, మోదీ టూర్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీస్ యంత్రాంగం. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, బోట్ జెట్టీ, హెలిప్యాడ్, స్టేట్ గెస్ట్ హౌస్‌లను పరిశీలించారు. ప్రధాని ధ్యానం కోసం దాదాపు 45 గంటల పాటు ఉంటారు కాబట్టి సముద్ర సరిహద్దులపై కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ నిఘా పెట్టింది. మరోవైపు మోదీ రాకను వ్యతిరేకిస్తూ తంతి పెరియార్ ద్రవిడర్ కళగం వంటి సంస్థలు నల్ల జెండాలతో నిరసనకు దిగాయి. ట్విట్టర్ వేదికగా గోబ్యాక్‌మోదీ హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట తమ నిరసన వ్యక్తం చేశాయి. ఇక గత ఎన్నికల్లోనూ ప్రచారం ముగిశాక 2019 మే 19న తుదిదశ పోలింగ్ జరగ్గా, మే 18న మోదీ ధ్యానానికి కూర్చున్నారు. కాషాయ శాలువా ధరించి కేదార్‌నాథ్‌లోని రుద్రగుహలో 17 గంటలపాటు ధ్యానం చేశారు. అయితే, ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారమేనని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అంటున్నాయి ప్రతిపక్షాలు.
ప్రజల్లో ఒక వర్గాన్ని ప్రభావితం చేసే ప్రయత్నానికి మోదీ ధ్యానాన్ని ఎంచుకున్నారని, అందుకే మోదీ ధ్యానానికి కూర్చున్న ఫొటోలు ప్రసారం, ప్రచురితం కాకుండా అడ్డుకోవాలని విపక్షాలు ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాయి. ఇలా గతంలో మాదిరే ప్రధాని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. మరి 2019లో ధ్యానం అనంతరం బీజేపీ మరోసారి అధి కారంలోకి రావడం, కేంద్రంలో చక్రం తిప్పడం జరిగింది. అదే సెంటి మెంట్‌తో మోదీ ధ్యానంలో మునిగారా..? గత ఫలితాలే రిపీట్ అవుతాయా అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీన వెలువడే రిజల్ట్స్ వరకూ వేచి చూడాల్సిందే.


