పురాకృత ప్రారబ్ద పాప ఫలాలను కష్టాల రూపంలో క్షీణింపచేసి..పునీతులుగా తీర్చిదిద్దే మహిమాన్విత మహోన్నత దేవ దేవుడు శనిదేవుడు. అయితే, శని అనే మాట వింటేనే యావత్ జగత్ ఠారెత్తిపోతుంది. సాక్షాత్ సూర్యభగవానుని కుమారుడు, సమవర్తి యమధర్మరాజుకు సోదరుడు, కళంకం లేని కరుణామూర్తి శని దేవుడు. ఇంతటి మహోన్నతుడైన శనీశ్వరునిపై భక్తులు ద్వేషభావం ప్రదర్శిస్తూనే అత్యంత భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. దైవస్థానం పొంది ధూషణలకు, తిరస్కారాలకు గురయ్యే ఏకైక దైవం శనిదేవుడు.
సర్వ దైవాలు భూషణాలంకార శోభితులుగా దర్శనమిస్తూ భక్తజన నీరాంజనాలను పొందుతూ.. భక్తులను కరుణిస్తువుండగా, ధూషణ, తిరస్కారాలు ఎదుర్కొంటూ, భయంకర, కఠోర, పాషాణ హృదయ రూపంతో నిర్దయగా పైకి కనిపించే శనిదేవుడు అంతర్గతంగా కరుణా సముద్రుడు, దయార్ద్రశీలి. చేసిన పాపం చెడని పదార్థం. ఆ పాపం పిశాచంలా పట్టి పీడిస్తుంటే.. ఆ పాపఫలాలు జన్మజన్మలూ సంచిత కర్మల్లా వెంటాడుతుంటే..ఎక్కడికక్కడే పాప కర్మలను బాధల పెట్టడం రూపంలో శనిదేవుడు హరిస్తూ ఉంటాడు.
అగాథ జలనిధిలో ఆణిముత్యం ఉంటుంది. కష్టనష్టాలు ఎదుర్కొని శోధనాన్వేషణ సాగిస్తే ఆణిముత్యం దక్కుతుంది. బాధలు, శోకాలు పూర్తిగా అనుభవిస్తే సుఖ సంతోషాలు తిష్టవేసి కూర్చుంటాయి. శనీశ్వరుడు తొలుత తీవ్ర బాధలు కలుగచేసి, చివరకు ఆనందామృతాన్ని అందిస్తాడు. మోయలేని భారాలు మోసేలా చేసి…గోవర్దన గిరిని చిటికిన వేలుతో ఎత్తిన చిన్నికృష్ణుడి శక్తి మాదిరి శక్తిని మనకు శని దేవుడు ప్రసాదిస్తాడు. మోయలేని భారాలు మోసేలా చేసి సమస్త దోషాలు, పాపాలు హరింపచేసి…ఇహ, పర సౌక్యాలకు అర్హునిగా చేసే అపర భక్తజన బాంధవుడు శనీశ్వరుడు. శనిదేవుడు ఎప్పుడూ తన కర్యవ్యనిర్వహణలో ఈషణ్మాత్ర పొరపాటు చేయడు. ఆ శనిదేవుడి పర్వదినం శనిత్రయోదశి. త్రయోదశితో కూడిన శనివారం శనిత్రయోదశి.
పాప పంకిలాలను పటా పంచలు చేసే సమయంలో శని దేవుడు ఉగ్రరూపంతో విధించే దండనలు భరించలేకపోతాం. శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అనువైన రోజు శని త్రయోదశి. శని జన్మించిన గొప్ప తిథి త్రయోదశి కావడంతో , ఈరోజున శనీశ్వరునికి తైలాభిషేకాలు, నవగ్రహ పూజలు చేస్తే ఆయన శాంతిస్తాడు. నవగ్రహ ఆలయాల్లో నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేయాలి. శనిదేవునికి తైలాభిషేకాలు చేసి నీల శంఖు పుష్పాలు, నల్లని వస్త్రాలతో పూజాదికాలు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడని పురాణ ప్రముఖులు, అర్చకస్వాములు చెబుతున్నారు.
నల్ల కాకి వాహనంపై నల్లని కాటుక రూపంలో దర్శనమిచ్చే శనీశ్వరుడు, ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని అనే పలు రూపాల్లో జనాలకు ఇక్కట్లు కలగజేస్తాడు. జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరిస్తే దాన్ని అర్ధాష్టమ శని, జన్మరాశి నుంచి ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే దాన్ని అష్టమ శని అంటారని పంచాంగ కర్తలు, ధార్మిక గురువులు చెబుతున్నారు. గత రాశిలో రెండున్నరేళ్లు, జన్మ రాశిలో రెండున్నరేళ్లు, తర్వాత రాశిలో రెండున్నరేళ్లు.. మొత్తం ఏడున్నరేళ్లు ఏలినాటి శని ఉంటుందని చెబుతున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న, తైలాభిషేకాలకు సంతసించి శాంతి స్థితిలో ఉన్నా శని ఎప్పుడూ నిదానంగా ముందుకు సాగుతాడు. ఈ కారణంగానే ఒక రాశిలో శని సంచారం రెండున్నర ఏళ్లు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని కష్టాలు ఎదుర్కొంటున్నవారు ప్రతి శనివారం నవగ్రహ పూజలు, శనీశ్వరునికి తైలాభిషేకాలు చేయించుకోవాలి. శనివార పూజలు, అభిషేకాలకు ఒకవేళ అంతరాయం కల్గినా, శనిత్రయోదశి నాడు మాత్రం శనీశ్వరునికి తైలాభిషేకాలు తప్పక చేయించాలి. ఏలినాటి శని, అష్టమశని, అర్థాష్టమ శని దోషాలు ఎదుర్కొంటున్నవారు శనిత్రయోదశి నాడు తైలాభిషేకాలు చేయించుకుంటే శనిబాధల నుంచి ఉపశమనం పొందుతారు. పౌర్ణమి ముందు వచ్చే శనిత్రయోదశి కంటే అమావాస్య ముందు వచ్చే శనిత్రయోదశికి పట్టు ఎక్కువని, ఈరోజు తైలాభిషేకాలు, శని దేవుని పూజలు చేయించుకుంటే.. చాలావరకు బాధలు తగ్గుతాయని పండిత శ్రేష్ఠులు చెబుతున్నారు. తైలాభిషేకాలతో పాటు నల్లని వస్త్రంలో నువ్వులు ఉంచి శని త్రయోదశినాడు దానమిస్తే శనిదోషం చాలావరకు తగ్గుతుందని తెలియజేస్తున్నారు.
త్రిమూర్తులు కొలువై ఉన్న రావి వృక్షం వద్ద శనిత్రయోదశి రోజున పూజలు చేస్తే అపార పుణ్యఫలం లభిస్తుందని పురాణ ప్రముఖులు చెబుతున్నారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతఃశివరూపాయ..వృక్ష రాజయతే నమః అనే శ్లోకాన్ని చదువుకుంటూ రావి చుట్టూ ముమ్మారు ప్రదక్షణలు చేయాలి. ఈ చెట్టు వద్ద శనిత్రయోదశి రోజున త్రిమూర్తులకు, శనీశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే సర్వ పాపాలు హరించి, సమస్త సౌక్యాలు సిద్దిస్తాయని అర్చక ప్రముఖులు చెబుతున్నారు. ఒక్క శనివారం రోజు తప్ప ఏ రోజున రావి చెట్టును తాకరాదని అంటున్నారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు ఏ రోజైనా చేయవచ్చు…అయితే, శనివారం రోజున మాత్రమే చెట్టును ముట్టుకోవాలి. ఇందుకు శనీశ్వరుడు, జేష్ఠాదేవి, లక్ష్మీదేవిలక సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
పాఠాలు, గుణపాఠాలు నేర్పే శనిదేవుడు మనిషికి అవసరమైన క్రమశిక్షణ నేర్పిస్తాడు. స్వప్న విహారాన్నుంచి వాస్తవ జీవితంలోని తీసుకొచ్చి చేదును రుచి చూపిస్తాడు. తినగ తినగ చేదును తీయగా చేసి…కష్టాల పునాదుల మీద సుఖ సౌధాలకు దోహదపడతాడు. భక్తి ప్రపత్తులు కల్గించి వైరాగ్యశక్తిని కల్గిస్తాడు. దయా, క్షమ, దాన ధర్మ గుణాలున్న వారిని కరుణిస్తాడు. విర్రవీగే వారికి విలువ లేకుండా చేస్తాడు. రాజును బంటుగా, బంటును రాజుగా చేసే శనీశ్వరుని అనుగ్రహానికి ఎవరు పాత్రులవుతారో…వారు ఇహ, పర సౌక్యాలకు అర్హులవుతారు. పాప, పుణ్యాలను బట్టి మనిషి నడవడిని నియంత్రించేది శనిదేవుడే. మనుషులు జీవితులుగా ఉన్నప్పుడు చేసే పాపపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తిగా శని దేవుడు వ్యవహరిస్తుండగా, ఆయన సోదరుడు యమదేవుడు.. మనిషి మరణానంతరం ఆ జీవి పాప పుణ్యాల ప్రకారం సమవర్తిగా ప్రవర్తించి శిక్షలు విధిస్తాడు.
శనిత్రయోదశి నాడు ఉప్పు, నువ్వుల నూనె కొనుగోలు చేయకూడదు. ఈ రెండు వస్తువలతో పాటు ఇనుము, ఆవనూనె, ఆవాలు, నల్ల వస్తువులు, ఛత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదు. శనిత్రయోదశి రోజున ప్రభాత సమయంలో శిరోస్నానం అత్యావశ్యకం. శని దేవునికి తైలాభిషేకాలతో పాటు శివాలయంలో అర్చన, ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శని ప్రభావం తగ్గుతుందని అర్చకస్వాములు చెబుతున్నారు. శనిదేవుని అనుగ్రహ, ఆగ్రహాలకు ముందు కొన్ని సూచనలు, సంకేతాలు కన్పిస్తాయని జ్యోతిష్య ప్రవీణులు తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం శనీశ్వర ఆలయం ఎదుట నల్ల కుక్క కనిపిస్తే మంచి జరుగుతుందని, ఇది శుభకారకమని చెబుతున్నారు. శనివారం నాడు ఇంటి ఆవరణలో కాకి నీరు తాగడానికి వచ్చినా, దాహార్తి తీర్చుకున్నట్టు దర్శనమిచ్చినా అది శుభసంకేతం, రాబోయే మంచికి సూచకం అని తెలియజేస్తున్నారు. అయితే, శనివారం నాడు కాకి తలపై తన్నినా, తాకినా కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నట్టు గమనించాలని, పరిహారం చేయించుకోవాలని చెబుతున్నారు.
————–