కలెక్టర్, అధికారులపై దాడి తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దాడి కుట్రలో కేటీఆర్ హస్తం ఉందని బహిరంగంగానే హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఘటన పై నిజామాబాద్ ఎంపీ కామెంట్లు ఇంకా సెన్సేషనల్‌గా మారాయి. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన వికారాబాద్ ఘటనను.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ప్రోద్బలంతోనే అధికారులపై దాడి జరిగిందని ఆరోపించారు. కేటీఆర్ అధికారం కోల్పోయామనే అసహనంలో ఉన్నారని మండిపడ్డారు. అధికారులపై దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని.. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్న వదిలిపెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చెప్పారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం తీవ్ర విమర్శలు చేశారు. దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. సురేశ్ కాల్ రికార్డింగ్‌లో కేటీఆర్ బండారం బయటపడిందని చెప్పారు. కేటీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ను చంపాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయన్ను కాపాడారని అన్నారు. పదేళ్ల అధికారంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు.
కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అధికారం పోయినా కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు.. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినట్లుగానే కేటీఆర్ సైతం వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. లగిచర్ల దాడి విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలోనూ కేటీఆర్ హస్తం ఉందంటూ ఆయన్ను జైల్లో వేయడమే కరెక్ట్ అని అన్నారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులో భాగంగా ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం..దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు కలెక్టర్, అధికారులపై దాడులకు దిగారు. వికారాబాద్ ఘటనను ఖండిస్తూ..కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి కుట్రలో కేటీఆర్ హస్తం ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఈ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది.