ప్రస్తుతం కాలం మొబైల్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు దిండు కిందగాని, పక్కనగాని పెట్టుకొని పడుకుంటారు. ఇది ప్రమాదకరమని చాలామంది మనకి సలహా ఇస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే ఫార్వర్డ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. మరి నిజంగా అలా జరుగుతుందా? ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అంత హానికరమా? ఇప్పుడు చూద్దాం.
మొబైల్ ఫోన్ దిండు కింద పెట్టుకుంటే డేంజరే కానీ ? అది మీరు అనుకొనే సమస్య కాదు. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్ మెసేజ్‌లు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే, ఫోన్ రేడియేషన్ అంత ప్రమాదకరమని చెప్పడానికి ఆధారాలు లేవు. ఫోన్లు తక్కువ శక్తి కలిగిన రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇది మన జన్యువులను లేదా కణాలను ప్రభావితం చేయదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ , అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ ప్రకారం ఇప్పటివరకు ఫోన్ రేడియేషన్ బ్రెయిన్ క్యాన్సర్‌కు కారణమన్న ఎలాంటి ఆధారాలు లేవు. దిండు దగ్గర ఫోన్ పెట్టుకుంటే రేడియేషన్ వల్ల చనిపోతారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
మొబైల్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, వైర్‌లెస్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిన గత 20 సంవత్సరాల్లో బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్స్-రేలాగా శక్తివంతమైనది కాదు. దీంతో మెదడు కణాలను నేరుగా ప్రభావితం చేసే ప్రమాదం లేదు. ఇకపోతే మొబైల్స్ ను దిండు దగ్గర ఫోన్ పెట్టుకొని పడుకుంటే రేడియేషన్ కంటే నిద్రపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. కానీ ఎక్కువసేపు ఫోన్ వాడితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ రెండూ ఫోన్ రేడియేషన్, మెదడుకు హాని కలిగిస్తుందని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు కనుగోలేదట. దిండు పక్కన ఫోన్ పెట్టుకుని పడుకుంటే గట్టిగా నిద్ర పట్టకపోవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై వచ్చే నోటిఫికేషన్ సౌండ్, లైట్ శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను ప్రభావితం చేయవచ్చు. నిద్రను దెబ్బతీసి నిద్రలేమి, మానసిక ఒత్తిడిను పెంచుతాయి. ఇకపోతే ఫోన్ ఎక్కువసేపు వాడితే అది వేడెక్కుతుంది. దిండు కింద పెట్టితే వేడి మరింత పెరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ ను దిండు కింద ఉంచి మాత్రం నిద్రపోవద్దు. ముఖ్యంగా సుఖమైన నిద్ర కోసం పడుకునే ముందు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి లేదా దూరంగా పెట్టండి. చార్జింగ్ కోసం ఫోన్‌ను మంచం దగ్గర పెట్టకండి. నిద్రకు ముందు ఫోన్ వాడకాన్ని చాలావరకు తగ్గించండి.
పరిశోధనల ప్రకారం.. రాత్రివేళల్లో తరచూ ఫోన్ మోగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈసమయంలో వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శరీరాన్ని త్వరగా అలసిపోయేలా చేస్తుందట. ఇదిక్రమంగా మన పని తీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. కాబట్టి రాత్రి వేళల్లో మొబైల్‌ను దూరంగా ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఫోన్‌ను దూరంగా ఉంచితే.. రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రం ఎనర్జీ తగ్గిపోతుంది. తీవ్రమైన పరిణామాలను నివారించడానికి కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. రాత్రి పూట నిద్రపోయే ముందు ఎన్‌టర్‌టైన్మెంట్ పేరుతో ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నో అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి మీరు పడుకునే సమయం కంటే ఓ అరగంట ముందే స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టేయండి.. నోటిఫికేషన్లు ఆఫ్ చేసేయండి.
ఇక కొంతమంది ఉంటారు .. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ ఫోన్ కోసం చూస్తారు. బ్రష్ చేయకముందే, ముఖం కడగకముందే ఫోన్ తీసుకొని నోటిఫికేషన్లు చెక్ చేస్తారు. ఇది ఒక చిన్న అలవాటు అనిపించినా, దీని ప్రభావం చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. రోజు మొదట్లోనే మొబైల్ చూడటం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది.
మనం కాస్త అలోచిస్తే, ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎంత సమయం వృథా అవుతుందో అర్థమవుతుంది. టైమ్ చూసేందుకు ఫోన్ తీసుకుంటే, అలా నోటిఫికేషన్లు ఓపెన్ చేస్తూ గంటలు గడిపేస్తాం. ఇంట్లో వాళ్లు గమనించాక కానీ మనం ఫోన్ పక్కన పెట్టలేం. ఇది చాలా మందికి రోజు జరిగే వ్యవహారమే. నిద్ర నుండి లేవగానే బ్రెయిన్ పూర్తిగా రిలాక్స్ స్టేట్‌లో ఉంటుంది. అప్పుడు మెదడుకు హఠాత్తుగా కాంతి ఎక్కువగా తగలడం, నోటిఫికేషన్లలో వచ్చే వార్తలు, సందేశాలు చూసే విధానం బ్రెయిన్‌ని ఒత్తిడికి గురిచేస్తుంది. దీనివల్ల ఆ రోజంతా మూడ్ స్వింగ్‌లు, చిరాకు, అలసట పెరుగుతాయి.దీని వల్ల మనిషి మనసికంగా ఆందోళనకు గురవుతాడు, చిరాకు పెరుగుతుంది. ఎటువంటి పనినైనా ఒత్తిడితో చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఏర్పడుతుంది. ఈ అలవాటు ఆపకపోతే, కొంత కాలానికి నరాల సమస్యలు వచ్చే అవకాశముంది. తీవ్ర ఒత్తిడిని తగ్గించుకోవాలంటే, ఉదయం లేవగానే మొబైల్ ముట్టుకోవడం మానేయాలి. కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌ను పక్కన పెట్టి ఇతర పనులపై దృష్టి పెట్టాలి.