29.2 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవడం టీడీపీకి సాధ్యమేనా ?

     విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశానికి మద్దతు ఇచ్చింది.

   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు అయింది. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడల్లా అది ముగిసిపోయిన అధ్యాయమని నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాత ప్రభుత్వం చాలా సార్లు తేల్చి చెప్పింది. ఇక విభజన చట్టంలోని అనేక అంశాలను ఈపాటికే అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి కేంద్రం సన్నాయి నొక్కులు కూడా నొక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే,  అన్నీ ఇస్తాం కానీ ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఇప్పటివరకు గతంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కావాలంటే ఏమైనా ఇస్తాం కానీ, స్పెషల్ స్టేటస్ అనే ముచ్చటే లేదని గతంలోని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

    విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం పాటు ప్రత్యేక హోదా అంశం చుట్టూనే రాజకీయాలు నడిచాయి.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడానికి సాయం చేసిన ప్రధాన అంశం ఇదే. తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని తాము మాత్రమే చేయగలమని అప్పట్లో ఊరువాడా ఏకం చేసి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఒక దశలో అయితే రాజకీయాలకతీతంగా ప్రత్యేక హోదా సాధన కోసం అప్పటి అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు తమ పార్టీకి చెందిన ఎంపీలతో కూడా రాజీనామాలు చేయిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలంతా పదవులకు గుడ్ బై కొట్టి ఢిల్లీలో కూర్చుంటే ప్రత్యేక హోదా రావడం పెద్ద కష్టం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక, జనం ముందుకు పోలేక ఎన్డీయే కూటమి నుంచి 2018 మార్చిలో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ఆ తరువాతి పరిణామాలు అందరికీ తెలిసినవే…ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి ఎన్డీయే కూటమిలో చేరింది తెలుగుదేశం పార్టీ.ప్రత్యేక హోదా సంగతి ఎలాగున్నా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఐదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం అంటూ ఏదీ కనిపించదు. వాస్తవానికి అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి.

వాస్తవానికి ఎన్డీయే కూటమిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేదు. అయితే ఎన్డీయే కూటమిలో లేకపోయినప్పటికీ మోడీ సర్కారు తీసుకునే ప్రతి సంచలన నిర్ణయాన్ని అందరికంటే ముందుగా బలపరిచే పార్టీల్లో ముందువరుసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ ఉండేది. కేంద్రంలో ఆ స్థాయిలో పలుకుబడి ఉన్నప్పటికీ అయిదు కోట్ల ఆంధ్రుల డిమాండ్ అయిన ప్రత్యేక హోదాను జగన్ ప్రభుత్వం సాధించలేకపోయింది. సాధించడం తరువాతి సంగతి అసలు ఆ దిశగా ఆయన ఎలాంటి ప్రయత్నం ఆయన చేయలేదన్న విమర్శలు న్నాయి. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఆర్థికంగా సదరు రాష్ట్రానికి బోలెడన్ని లాభాలుంటాయి. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇస్తున్న ఫండ్స్ లో ముప్ఫయి శాతం నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందచేస్తారు. మిగిలిన డెబ్భయి శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. గ్రాంట్ల రూపంలో కూడా మేలు జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. అలాగే పన్నుల్లో మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయి తీలు కల్పిస్తారు. అలాగే ప్రోత్సాహకాలు అందిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు. ఏమైనా, ఈసారి కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకం గా మారింది . నరేంద్ర మోడీ సర్కార్‌కు ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఎంతైనా ఉంది.ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చొరవ చూపాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్