ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అమలుపై అధికారుల స్థాయిలో కసరత్తు. ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పై ఎంత భారం పడుతోంది.? మహిళల రద్దీ దృష్ట్యా రోజుకు ఎన్ని బస్సులు నడపాలి.?పథకం పూర్తిస్థాయిలో అమలు చేస్తే ఆటో డ్రైవర్ల ఆందోళన. రాష్ట్రమంతటా ఈ స్కీం అమలు చేయాలా..? లేదంటే పరిమితులు విధించాలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి. సూపర్ సిక్స్‌తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కసరత్తు జరుగు తోంది.
ఏపీలో ఈసారి గెలుపే లక్ష్యంగా టీడీపీ హామీల వర్షం కురిపిచింది. సూపర్ సిక్స్ హామీలతో టీడీపీ ప్రజల ముందుకు వెళ్లింది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజనాపై పడుతున్న భారం, లాభ – నష్టాల పైన ఫోకస్ చేశారు. ఏపీలో ఆర్టీసీ ప్రభు త్వంలో విలీనం అయింది. దీంతో రోజు వారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాలపై నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ఈ పథకం అమలు, ఎదురయ్యే సమస్యలపై నివేదికలో పొందు పరుస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రీయంబర్స్‌మెంట్ ఎలా అందుతోందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డ్ చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ పథకం అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకొనే నిర్ణయాలపై ఆసక్తి కనిపిస్తోంది.