స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఉండనుందని తేలడంతో అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో ఫలితాలపై జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.
కాంగ్రెస్ వస్తుందని కొందరు, బీజేపీ వస్తుందని మరికొందరు లేదు హంగ్ ఏర్పడి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫలితాల నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఏ పార్టీ ప్రలోభాలకు తమ అభ్యర్థులు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరి కన్నడనాట ఏ పార్టీ అధికారం చేపట్టనుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.