ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది ఎన్డీయే కూటమి. బీజేపీతో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మరికొంత కష్టపడితే 400 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తు న్నారు. బీజేపీకి తన శక్తిసామర్థ్యాలు కంటే ప్రత్యర్థి శిబిరమైన ఇండియా కూటమిలోనే అనైక్యతపైనే ఎక్కువ నమ్మకం ఉంది.
కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో అనైక్యతపై ఈసారి బీజేపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇటీవలి వరకూ విభేదాలున్న మాట వాస్తవమే. అయితే సకాలంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని, భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరపడంతో విభేదాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ జట్టుకట్టాయి. అనైక్యతతో తాము కొట్లాడుకుంటే కమలం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందన్న సోయ ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాల్లో కలిగింది. దీంతో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పెద్దరికాన్ని గౌరవిస్తూ సీట్ల కేటాయింపునకు మిగతా పక్షాలు సన్నద్ధమయ్యాయి. 2014 నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలనపై తనదైన ముద్రవేసింది. ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు సామాన్య ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ పెరిగిన మాట కూడా వాస్తవం. దీనిని ఎవరూ కొట్టి పారేయలేరు.
ప్రధానంగా అయోధ్య అంశం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది ఐదు దశాబ్దాల హిందువుల కల. ఈ కలను సాకారం చేసిన ఘనత నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌కు దక్కింది. దీంతో రాజకీయపార్టీలకతీతంగా దేశవ్యాప్తం గా హిందువులందరూ తమపక్షాన ఉంటారన్న భరోసా కమలం పార్టీకి కలిగింది. ఇదిలాఉంటే ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన వాస్తవాన్ని విస్మరించకూడదు. సమాజంలోని అనేకవర్గాలు బీజేపీకి దూరమయ్యాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు కమలం పార్టీకి దూరమ య్యారని తెలుస్తోంది. ఎవరెన్ని కబుర్లు చెప్పినా, సమాజానికి అన్నం పెట్టేది రైతన్నలే. అలాంటి రైతన్నల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. దాదాపు మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అత్యంత వివాదా స్పదంగా మారాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో దాదాపు ఏడాదిపాటు అన్నదాతలు మహోద్యమం చేశారు. ప్రధానంగాపంజాబ్, హర్యానా రైతులు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తూతూ మంత్రంగా రైతుసంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపింది. దీంతో చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివే యడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా, రైతులు వెనక్కి తగ్గలేదు. పైపెచ్చు రైతుల ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీయే వెనక్కి తగ్గారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. ఈ సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధానంగా హిందీ బెల్ట్‌లోని అన్నదాతలు నరేంద్ర మోడీ సర్కార్‌పై గరంగరంగా ఉన్నట్లు వార్తలందుతు న్నాయి. విదేశాల్లోని బ్లాక్‌మనీని తీసుకురావడమే లక్ష్యంగా కొన్నేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేసింది నరేంద్ర మోడీ సర్కార్. అయితే నోట్ల రద్దుతో చిన్నా చితకా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ప్రధానంగా ఫుట్‌పాత్‌లపై బండ్లు పెట్టుకుని ఏరోజు బిజినెస్ ఆరోజు చేసుకునే చిరు వ్యాపారుల ఇబ్బం దుల పాలయ్యారు. అయితే నోట్ల రద్దు జరిగి ఇప్పటికి సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ బ్లాక్ మనీ తీసుకువచ్చిందో నరేంద్ర మోడీ సర్కార్ వెల్లడించలేదు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుందన్న విమర్శలు చాలాకా లంగా ఉన్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పని అంత సులువుగా లేదు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ దూకుడును తట్టుకోవడం అంటే కమలం పార్టీకి చిన్న విషయం కాదు. ఎత్తులు వేయడం లోనూ వ్యూహాలు పన్నడంలోనూ బీజేపీకి ఏమాత్రం తగ్గరు మమతా బెనర్జీ. వీటన్ని టితోపాటు అవసర మైతే బెంగాల్ సెంటిమెంట్‌ను కూడా మమతా బెనర్జీ రాజేయగలరు. అలాగే బీహార్లో కాంగ్రెస్ , రాష్ట్రీయ జనతాదళ్ మధ్య గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయాయి. బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో రెండు పార్టీలు మళ్లీ ఏకమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలగి, బీజేపీ శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాత్రికిరాత్రి నితీశ్ కుమార్ శిబిరం మార్చడం, మెజారిటీ బీహారీలకు మింగుడుపడ లేదు. దీంతో నితీశ్ కుమార్ ఎపిసోడ్ ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్‌గా మారుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ హవా ఉత్తరాదిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అయితే ఈ పదకొండునెలల కాలంలో కన్నడనాట బీజేపీ పుంజుకుంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కొంటోంది. ఇక తమిళనాడు విషయాని కొస్తే ,అక్కడ బీజేపీది దాదాపుగా ఒంటరిపోరే. ఇటు డీఎంకే అటు అన్నాడీఎంకే ఈ రెండు పార్టీల్లో దేనితోనూ ఈసారి కమలం పార్టీ పొత్తుపెట్టుకోలేదు. డీఎండీకే లాంటి ఒకట్రెండు ఉప ప్రాంతీయ పార్టీలే ప్రస్తుతం బీజేపీ శిబిరంలో ఉన్నాయి. చివరగా కేరళను ప్రస్తావించుకుంటే, ఆ దేవభూమి ఇప్పటికీ కమలం పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. కమల నాథులు పైకి ఎంత డాంబికాన్ని ప్రదర్శించినా, 400 సీట్ల టార్గెట్ చేరుకోవడం ఎన్డీయే కూటమికి నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు.