యుద్ధం అంటేనే విధ్వంసం సృష్టించే బాలిస్టిక్ మిసైళ్లు, విరుచుకుపడే సూసైడ్ డ్రోన్లు, గురి తప్పని ఫైటర్ జెట్లు. ఇప్పుడు ఇదే సీన్ పశ్చిమాసియాలో కనిపించనుంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనే ఆందోళన అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ భూభాగంలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతం అగ్నిపర్వతంలా మారి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా దాడులు తప్పవని ఇరాన్ ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పేలుళ్లు వినిపించాయి. అయితే ప్రాణనష్టం జరిగించి మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు.
మరోవైపు ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దీనికి ఇజ్రాయెల్ ధీటుగా స్పందించింది. తమపై దాడి చేస్తే రియాక్షన్ కనీవిని ఎరుగని రీతిలో ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తే అడ్డుకుని తీరతామని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. అంతేకాకుండా అందుకు తగినట్లుగా తన భారీ యుద్ధనౌకలను అత్యాధునిక సబ్ మెరైన్లును పంపంది. ఇవన్నీ చూస్తుంటే ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే..రెండు దేశాల బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ చిన్న దేశమైనా టెక్నాలజీ పరంగా చూస్తే ఇరాన్ కన్నా చాలా ముందంజలో ఉంది. చాలా దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి ఆ దేశం ఎదిగింది. భారత్‌కు కూడా ఆయుధాలను సరఫరా చేసింది. పైగా ఇజ్రాయెల్ అణ్వాయుధాలు కలిగిన దేశం. తిరుగులేని రక్షణ వ్యవస్థ ఆ దేశం సొంతం. ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసంపెట్టే ఖర్చు చాలా ఎక్కువ. 2022, 2023లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు కాగా.. ఇజ్రాయెల్ దాదాపు 19 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ఇజ్రాయెల్ దగ్గర 340 యుద్ధ విమానాలు,F15, F-35 లాంటి ఫైటర్లు జెట్లు ఉండగా..ఇరాన్ దగ్గర 320 యుద్ధ విమానాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ పాతవి కావడం గమనార్హం. 1960 నాటి F-4, F-5, F-14 వార్ జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరమ్ డోమ్‌దే కీలక పాత్ర పోషిస్తుంది. సైన్యం పరంగా చూస్తే ఇరాన్‌లో 6లక్షల మంది సైనికులుంటే, ఇజ్రాయెల్ దగ్గర లక్షా 70వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇరాన్ నేవీ దగ్గర 220 నౌకలు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 60 నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ వైమానికంగా చాలా బలంగా ఉంది. ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీపరంగా చాలా వీక్‌గా ఉంది. ఇజ్రాయెల్‌కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవని నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెల్ ఆయుధాలు, టెక్నాలజీ పరంగా ముందంజలో ఉందని చెప్పవచ్చు.