దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. జూన్ 1న ఆఖరి దశ పోలింగ్ జరుగు తుంది. ఆ తర్వాత నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు స్వాగతం పలికేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. నూతన పార్లమెంటుకు సంబంధించిన అనుబంధ భవనంతోపాటు ఢిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో వెల్‌కం చెప్పేందుకు, ఇతర సౌకర్యాల కల్పనపై వారికి సమాచారం ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చివరికి వచ్చేసింది. జూన్ ఒకటిన ఆఖరి దశ నిర్వహణతో పోలింగ్ ముగు స్తుంది. అనంతరం జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు తతంగం పూర్తైన తర్వాత.. విజయం సాధించిన నూతన ఎంపీలకు దేశ రాజధానితోపాటు పార్లమెంటులో అవసరమైన సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే.. నూతన పార్లమెంటు భవనంలో సభ్యులకు స్వాగతం పలకాల్సి ఉంది. కానీ, ఇక్కడ పునరాభివృద్ధి పనులు కొనసాగుతు న్నాయి. దీంతో పార్లమెంటుకు అనుబంధంగా ఉన్న భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. ఇందుకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను వేరే చోటుకి తరలించడం లాంటివి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు తమ వాహనా ల్లోంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను ఎక్కడికక్కడ ఓ క్రమపద్దతిలో కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో గతంలో మాదిరిగా నేరుగా పార్లమెంటు భవనంలోకి కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వీరికి తాత్కాలిక వసతి కోసం రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో, వెస్టర్న్ కోర్ట్ హాస్టల్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ సభ్యులకు బస ఏర్పాటు చేయనున్నారు. జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలయ్యే ఎంపీలు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం పట్టనుం డడంతో, ఆ తర్వాత వాటికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి, మెరుగులు దిద్ది కొత్తవారికి ఆయా భవనాలను కేటాయిస్తారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరిగి.. సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడతాయి. దీంతో ఆ రోజు సాయంత్రం నుంచే నూతన సభ్యులు ఢిల్లీ చేరు కుంటారని లోక్‌సభ సచివాలయ అధికార యంత్రాంగం భావిస్తోంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటు భవనంలో ప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించనుంది.
ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు వివిధ రకాల సౌకర్యాలు, సదుపాయాలు పొందేందుకు అవసరమైన స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. ఇందుకోసం నూతన సభ్యులంతా వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని స్వీకరించి, సంబంధిత ఎంపీల ఫోటోలు తీసుకోవడం చేయను న్నారు. బాంక్వెట్ హాలుతోపాటు ఇతర గదుల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హస్తినలోని విమానాశ్రయంతోపాటు వివిధ రైల్వే స్టేషన్లలో ఇందుకు సంబంధిం చిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచి ఢిల్లీలోని విమానాశ్రయం లేదంటే రైల్వే స్టేషన్లకు వచ్చిన ఎంపీ లను నేరుగా పార్లమెంటు భవనానికి తీసుకువెళతారు. అక్కడే వారికి కొత్త ఫోన్ కనెక్షన్లు, వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు, నూతన బ్యాంకు ఖాతాలు, దౌత్యపరమైన పాస్ పోర్టులు, అధికారి ఈ మెయిల్ ఖాతాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం ఇలా అవసరమైన అన్ని వసతులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తంగా చూస్తే, జూన్ నాలుగు తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల రాకపోకలతో దేశ రాజధాని ఢిల్లీలో మరింత సందడి పెరగనుంది.