కేరళలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 18 ఏళ్ల దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మందికి పైగా వ్యక్తులు లైంగిక వేధింపుల కు పాల్పడ్డారు. ఐదేళ్లుగా ఈ దారుణాలను భరిస్తూ వచ్చిన ఆ యువతి.. చివరకు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తన ఆవేదనను చెప్పుకుంది. దీంతో ఈ అమానుషం బయటికొచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పథనంథిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఇప్పటకే 15మందిని అరెస్టు చేయగా .. తాజాగా మరో 9 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.
13 ఏళ్ల వయసులోనే తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది. ఆ తర్వాత పలువురు కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. భయంతోనే ఇన్నాళ్లూ ఈ విషయం బయటపెట్టలేదని పేర్కొంది.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. 62 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలిని ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు. బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది.
బాలిక వాంగ్మూలం ప్రకారం, అనుమానితులతో మాట్లాడేందుకు ఆమె తన తండ్రి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించిందని, ఆమె వద్ద ఉన్న ఫోన్ వివరాలు , డైరీ నుండి తీసుకున్న సమాచారం ఆధారంగా ద్వారా 40 మంది వ్యక్తులను గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
బాధితురాలి ప్రవర్తనలో మార్పును గుర్తించిన ఆమె టీచర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ప్యానెల్‌కు తెలియజేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం కమిటీ పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు స్పెషల్ ఇన్విస్టిగేటింగ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.