ప్రతిష్టాత్మక ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ నేషనల్ స్టేడియంలో భారత జెండా లేకపోవడం వివాదాస్పదమైంది. కరాచీ స్టేడియానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు దీనిని విస్తృతంగా షేర్ చేశారు. ఈ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక వద్ద భారత జెండా కనిపించకపోవడం చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. భారత జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడుతుండటం దీనికి కారణం కావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
కరాచీ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు జరగడానికి ఇంకా రెండు రోజులు ఉండగా.. ఈ సమయంలో కరాచీ స్టేడియం నుంచి ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో ఈ ఛాంపియన్ షిప్‌లో ఆడుతున్న అన్ని దేశాల జెండాలు ఉండగా.. ఒక్క భారత్ జాతీయ పతాకం మాత్రం కనిపంచలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడిందని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐసీపీ ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. చాపియన్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు టీమిండియా విముఖత చూపించడంతో ..హైబ్రిడ్ మోడ్‌లో టోర్నమెంట్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా జట్టు అర్హత సాధిస్తే సెమీ-ఫైనల్ , ఫైనల్‌తో సహా టీమిండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. BCCI, PCB, ICCల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ జట్టు రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఆతిథ్య మిచ్చే ఐసీసీ ఈవెంట్లకు కూడా తన మ్యాచ్‌లను ఇండియాలో ఆడదు.