- 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
- ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ
భారత బంగ్లాదేశ్ క్రికెట్ జట్లమధ్య జరిగిన మూడో వన్డేలో భారతజట్టు ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 227 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ 2-0తో వన్డే సీరీస్ నెగ్గింది. భారతజట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 34 ఓవర్లకే 182 పరుగులకు ఆలౌట్ అయింది. భారతజట్టులో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో 409 పరుగులు చేయగలిగింది.
వన్డేలలో భారత్ 400 పైగా పరుగులు చేయడం ఇది నాలుగోసారి. ఇషన్ కిషన్ వన్డేలలో అత్యంత వేగంగా కేవలం 126 బంతుల్లో 23 బౌండ్రీలు, 9 సిక్సర్లతో డబుల్ సెంచరీ సాధించి .. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గెయిల్ రికార్డును తిరగరాశాడు. క్రిస్ గెయిల్ గతంలో 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.
భారత్ తరపున గతంలో సచిన్ తెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేలలో డబుల్ సెంచరీ చేశారు. రోహిత్ శర్మ మూడు సార్లు 200 పైగా పరుగులు చేశాడు. కాగా, వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన 7వ ఆటగాడిగా, అతి పిన్న వయస్సువాడిగా ఇషాన్ రికార్డు నెలకొల్పాడు.